ఇదో తమలపాకుల యుద్ధం. అవినాష్‌కు ఏమీ కాదు- రఘురామకృష్ణంరాజు

ఈ మూడు విజ్ఞప్తుల్లోనూ సుప్రీంకోర్టు స్పందించే అవకాశం లేదన్నారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనమే ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిందని.. ఇప్పుడు మరోసారి విజ్ఞప్తి చేసినా ఇతర బెంచ్‌లు ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చన్నారు.

Advertisement
Update:2023-05-23 13:53 IST

కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపించడం లేదన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. సీబీఐకి, అవినాష్ రెడ్డికి మధ్య అండర్‌స్టాండింగ్‌తోనే వ్యవహారం నడుస్తోందని అభిప్రాయపడ్డారు.

అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అర్థరహితమైనదన్నారు. సుప్రీంకోర్టు ముందు అవినాష్ రెడ్డి మూడు ఆప్షన్లను పెట్టారని.. తల్లి అనారోగ్యం కారణంగా అరెస్ట్‌ చేయకుండా సుప్రీంకోర్టే ఆదేశాలు ఇవ్వాలన్నది ఒకటి కాగా.. హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ తన పిటిషన్‌ను విచారించేలా ఆదేశాలు ఇవ్వాలన్నది రెండోది అన్నారు. కానీ హైకోర్టులో ఇప్పటికీ పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. పిటిషన్ వేయకుండానే హైకోర్టు వెకేషన్ బెంచ్‌ విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారన్నారు. అదీ సాధ్యం కాని పక్షంలో తాను ఇది వరకే హైకోర్టులో ఒక పిటిషన్ వేశానని దాన్ని వచ్చే నెల 5న కోర్టును విచారించనుందని అప్పటి వరకు అరెస్ట్‌ చేయకుండానైనా ఆదేశాలు ఇవ్వాలని ఇలా మూడు విజ్ఞప్తులను సుప్రీంకోర్టు ముందు అవినాష్ రెడ్డి ఉంచారన్నారు.

ఈ మూడు విజ్ఞప్తుల్లోనూ సుప్రీంకోర్టు స్పందించే అవకాశం లేదన్నారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనమే ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిందని.. ఇప్పుడు మరోసారి విజ్ఞప్తి చేసినా ఇతర బెంచ్‌లు ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని గానీ, వద్దు అని గానీ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం లేదన్నారు. అరెస్ట్‌పై సీబీఐ ఇష్టానికే వదిలేసే అవకాశం ఉందన్నారు.

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్న ఆలోచన ఉంటే సీబీఐ బృందాలు కర్నూలులోని ఆస్పత్రికి వెళ్లాలి గానీ ఎస్పీతో చర్చలు జరపడం ఏమిటని ప్రశ్నించారు. సీబీఐ అధికారులు ఆస్పత్రి వద్దకు వెళ్తే దాడి చేసేంత ధైర్యం ఎవరూ చేసే అవకాశం లేదన్నారు. ఒకవేళ దాడి చేసినా స్థానిక పోలీసులు అడ్డుకోకపోతే జిల్లా ఎస్పీని సర్వీస్‌ నుంచే తొలగించే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి ఆస్పత్రి వద్ద తమకు భోజనాలు పెట్టారు కాబట్టి వైసీపీ వాళ్లను తాము ఏమీ అనం అని జిల్లా పోలీసులు చెప్పేందుకు వీలుండదన్నారు. స్థానిక పోలీసులు సహకరించకపోతే సీఆర్‌పీఎఫ్‌ బలగాలను దింపే అవకాశం ఉంటుందన్నారు.

అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేసే ఉద్దేశం సీబీఐకి ఉన్నట్టుగా అనిపించడం లేదన్నారు. అవినాష్ రెడ్డికి సీబీఐకి మధ్య తమలపాకుల యుద్ధం నడుస్తోందన్నారు. ఇద్దరు తమలపాకులతో గట్టిగా కొట్టుకుంటూ ఏదో జరుగుతోందన్న భావన కలిగిస్తున్నారని విమర్శించారు. ఎలాగో అరెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి మరీ అంత చిన్న ఆస్పత్రిలో ఉండడం బాగోదని కాబట్టి హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి మారాల్సిందిగా రఘురామకృష్ణంరాజు సలహా ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News