ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రయాణికులు క్షేమం
అదే మార్గంలో వెళ్తున్న ఒక వ్యక్తి బస్సు ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా కె.బిట్రగుంట వద్ద జాతీయ రహదారిపై దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారి లగేజీలు మొత్తం కాలిబూడిదయ్యాయి. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
27 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు బిట్రగుంట వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంజిన్‌లో సమస్య వల్ల అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా వచ్చిన మంటలతో డ్రైవర్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు.
వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ప్రయాణికులందరినీ నిద్రలేపాడు. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు హుటాహుటిన బస్సు నుంచి దిగిపోయారు. దీంతో ప్రయాణికులంతా ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో వారి లగేజీ మాత్రం పూర్తిగా కాలిపోయింది.
అదే మార్గంలో వెళ్తున్న ఒక వ్యక్తి బస్సు ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు ప్రయాణికులను ఇతర వాహనాల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరవేశారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.