బాబు హామీలతో జీతాలు ఇవ్వగలరా..? - పేర్ని నాని
చంద్రబాబు హామీలు అమలులోకి వస్తే కనీసం ఆలస్యంగా కూడా జీతాలు వచ్చే అవకాశం లేదని, మొత్తంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు పేర్ని నాని.
చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేస్తే అసలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలరా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయాలంటే ఏపీ బడ్జెట్ సరిపోదని, అంటే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరని ఎద్దేవా చేశారు. బాబు మేనిఫెస్టో చూసి, ఉద్యోగులు కూడా భయపడిపోతున్నారని, అందుకే పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి వారు మద్దతిస్తున్నారని అన్నారు. ఉద్యోగుల అండదండలు జగన్ కే ఎక్కువగా ఉన్నాయని వివరించారు పేర్ని నాని.
ఏడాదికి 71వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్న సీఎం జగన్ జీతాలు ఒకటో తేదీ ఇవ్వడానికి కష్టపడుతున్నారని చెప్పారు పేర్ని నాని. జీతాలు కాస్త ఆలస్యం అయినా కూడా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, అయితే చంద్రబాబు హామీలు అమలులోకి వస్తే కనీసం ఆలస్యంగా కూడా జీతాలు వచ్చే అవకాశం లేదని, మొత్తంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందుకే ఉద్యోగులంతా జగన్ వైపు చూస్తున్నారని లాజిక్ చెప్పారు పేర్ని నాని.
సామాన్య ప్రజల్లో కూడా బాబు మేనిఫెస్టోపై నమ్మకం లేదన్నారు పేర్ని నాని. జగన్ అమలు చేస్తున్న పథకాలను గతంలో తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు అవే పథకాలు కొనసాగిస్తానని ఎలా చెబుతున్నారని నిలదీశారు. అంతకంటే గొప్పగా ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని, జగన్ కి సాధ్యం కానిది, చంద్రబాబుకి సాధ్యమవుతుందా అని నిలదీశారు. హామీలు అమలు చేయడం అసాధ్యమని తెలిసే చంద్రబాబు ప్రజల్ని మోసం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు నాని.
పోస్టల్ బ్యాలెట్ నేటినుంచి మొదలు కావడంతో రాజకీయ పార్టీలు ఉద్యోగుల్ని ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉద్యోగులంతా తమవైపే అని చెప్పుకున్న టీడీపీకి ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. మేనిఫెస్టోలో అలవికాని హామీలిచ్చి తన ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజీ చేసుకున్నారు చంద్రబాబు.