టిష్యూ పేప‌ర్‌లా మారిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

విశాఖలో మంత్రులపై దాడి నేప‌థ్యంలో ప్ర‌భుత్వ విప్, మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఘాటు విమ‌ర్శ‌లు

Advertisement
Update:2022-10-16 12:22 IST

విశాఖ‌ప‌ట్నంలో శ‌నివారం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మంత్రుల కార్ల‌పై చేసిన దాడి ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వ విప్‌, మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి గుంటూరు జిల్లాలో ఆదివారం విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయ డ్రామాల్లో చిక్కుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్యాకేజీ తీసుకొని టిష్యూ పేపర్‌లా మారాడ‌ని ఘాటుగా విమ‌ర్శించారు. దీనిని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు రాష్ట్రంలో విభజన అనంతరం అమరావతిని రియల్ ఎస్టేట్ కోసం ఉప‌యోగించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని చెప్పారు. అందులో భాగంగానే రైతుల నుంచి 32 వేల ఎకరాలు సేకరించి బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. దీనికి పవన్ కల్యాణ్‌ను అడ్డం పెట్టుకొని మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజకీయ క్రీడ నిర్వహిస్తున్నారని, దీనిని కార్య‌క‌ర్త‌లు అర్థం చేసుకోవాల‌ని సూచించారు.

అభివృద్ధి లేక‌.. పూర్తిగా వెనుక‌బడిన ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు త‌మ ప్రాంతానికి చెందిన విశాఖ‌ప‌ట్నాన్ని ప‌రిపాల‌న రాజ‌ధానిగా చేస్తే త‌మ బ‌తుకులు బాగుప‌డ‌తాయ‌నే ఆకాంక్ష‌తో విశాఖ గ‌ర్జ‌న స‌భ విజ‌య‌వంతంగా నిర్వ‌హించుకుంటే.. దానిని భ‌గ్నం చేసేందుకు చంద్ర‌బాబు నాయుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌ల‌సి విశాఖ‌ప‌ట్నంలో అల‌జ‌డి సృష్టించాడ‌ని మండిప‌డ్డారు.

విశాఖ‌ప‌ట్నంలో మంత్రులు జోగి ర‌మేష్‌, రోజా, టీటీడీ బోర్డు చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిలపై దాడి అందులో భాగ‌మేన‌ని విమ‌ర్శించారు. ఈ దాడుల‌ను త‌మ పార్టీ, ప్ర‌భుత్వం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించ‌బోమ‌ని హెచ్చ‌రించారు. మ‌రోసారి ఇలాంటి దాడులు పున‌రావృతం అయితే.. త‌గిన బుద్ధి చెప్ప‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News