పవన్ కల్యాణ్ కి రికరెంట్ ఇన్ ఫ్లూయెంజా..
పవన్ కల్యాణ్ కి వచ్చింది సాధారణ జ్వరం కాదని, రికరెంట్ ఇన్ ఫ్లూయెంజా.. కారణంగా ఆయనకు ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందని ప్రెస్ నోట్ లో వివరించారు.
కాకినాడ సభలో పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. జ్వరం వస్తే పవన్ హైదరాబాద్ పరిగెత్తుతున్నారంటూ వెటకారం చేయడంతో.. మా హీరో పవర్ స్టార్ అని చెప్పుకునే పవన్ అభిమానులు ఫీలయ్యారు. దీంతో జనసేన ప్రత్యేకంగా ఈరోజు ఓ ప్రెస్ నోట్ విడుదల చేయాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్ కి వచ్చింది సాధారణ జ్వరం కాదని, రికరెంట్ ఇన్ ఫ్లూయెంజా.. కారణంగా ఆయనకు ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందని ప్రెస్ నోట్ లో వివరించారు. అందుకే ఆయనకు తరచూ ఏదో ఒక సమయంలో జ్వరం వస్తోందని చెప్పారు.
అలాంటివి చేయొద్దు..
పవన్ కల్యాణ్ కోసం క్రేన్ తో గజమాలలు తేవొద్దని ప్రెస్ నోట్ ద్వారా అభిమానులకు సూచించారు. అంతే కాదు, ఆయనపై అభిమానంతో పూలు కూడా చల్లొద్దని కోరారు. పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన మొహంపై పడకుండా జాగ్రత్తగా ఉండాలని, ఫొటోలకోసం ఆయన్ను ఇబ్బంది పెట్టొద్దని, కరచాలనం అడగొద్దని కూడా సూచించారు. అనారోగ్యంతో ఉన్న పవన్ కల్యాణ్ ని మరింత ఇబ్బంది పెట్టొద్దని జనసైనికులు, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
వైసీపీ సెటైర్లు..
పవన్ కల్యాణ్ కి రికరెంట్ ఇన్ ఫ్లూయెంజా.. అంటు జనసేన ప్రెస్ నోట్ విడుదల చేయడంపై వైసీపీ మళ్లీ సెటైర్లు పేలుస్తోంది. వచ్చాడండి ఫ్లవర్ స్టార్ అంటూ వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఓ మెసేజ్ పెట్టారు. "4 రోజులు ఎండలో తిరిగితే జ్వరం వస్తుంది. అభిమానులు పూలు వేస్తే ఎలర్జీ వస్తుంది. అలాంటి మీరు ఎండనక వాననక ప్రజల్లో తిరిగే సీఎం జగన్ పై జరిగిన దాడిని గులకరాయి అని హేళన చేస్తారా? రెండు రోజులు ప్రజల్లో ఉండలేని మీరు, జ్వరం వస్తే ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ పారిపోయే మీకు రాజకీయాలెందుకు? పోయి రిసార్ట్ లో రెస్ట్ తీసుకోండి!" అంటూ వైసీపీ నుంచి ట్వీట్ పడింది. దీంతో ఇరు పార్టీల మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది.