ఇకనుంచి పిఠాపురం నా స్వస్థలం.. ట్రోలర్స్ కు పని కల్పించిన పవన్
తాను పల్నాడు బిడ్డనని, బాపట్లలో పుట్టానని, చీరాల తన స్వస్థలం అని, నెల్లూరులో పెరిగానంటూ.. ఇలా అన్ని ప్రాంతాల గురించి ఒకే అభిప్రాయాన్ని చెప్పేవారు పవన్.
ఇకనుంచి పిఠాపురం తన స్వస్థలం అని చెప్పారు పవన్ కల్యాణ్. ఇక్కడి నుంచే రాష్ట్ర భవిష్యత్తుని మార్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు.. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ తన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారాయన. పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందన్నారు. కేవలం తన గెలుపుకోసమే అక్కడ పోటీ చేయట్లేదని, గాజువాక, భీమవరంతోపాటు ఇకపై తనకు పిఠాపురం కూడా ముఖ్యమేనన్నారు పవన్.
ట్రోలింగ్ మొదలు..
పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాననగానే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. గతంలో తాను పుట్టిపెరిగిన ప్రాంతాల గురించి పవన్ చెప్పిన మాటల్ని సోషల్ మీడియాలో రీపోస్ట్ చేస్తూ ట్రోలింగ్ చేశారు. తాను పల్నాడు బిడ్డనని, బాపట్లలో పుట్టానని, చీరాల తన స్వస్థలం అని, నెల్లూరులో పెరిగానంటూ.. ఇలా అన్ని ప్రాంతాల గురించి ఒకే అభిప్రాయాన్ని చెప్పేవారు పవన్. ఆమధ్య సిద్ధవటం వెళ్లినప్పుడు తాను ఆ ప్రాంతంలో ఎందుకు పుట్టలేదా అని బాధపడినట్టు కూడా చెప్పుకున్నారు. తాను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం వాడినని చెప్పుకోవడం పవన్ కు అలవాటు. అలా పిఠాపురం గురించి కూడా చెబుతాడంటూ గతంలోనే అంచనా వేశారు నెటిజన్లు. ఆ అంచనాల్ని పవన్ ఇప్పుడు నిజం చేశారు. పిఠాపురం తన స్వస్థలం అని అన్నారు.
పవన్ గెలుపు సాధ్యమేనా..?
పిఠాపురంలో కాపు ఓట్లు వన్ సైడ్ గా పవన్ కి పడతాయని ఆశించలేం. వైసీపీ తరపున పోటీ చేస్తున్న వంగా గీత, కాపు ఓట్లను చీల్చే అవకాశముంది. పైగా పవన్ కి వర్మ రూపంలో అసంతృప్తి సెగ కూడా తగిలింది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ హామీతో వర్మ మెత్తబడినా, పవన్ గెలవడం వల్ల ఆయనకు వచ్చే ఉపయోగమేమీ ఉండదు. అందుకే పైకి సర్దుకుపోయినట్టు ఉన్నా.. వర్మ వ్యూహం తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్, ఈసారి మధ్యే మార్గంగా పిఠాపురంకి ఫిక్స్ అయ్యారు. ఈసారయినా పవన్ అసెంబ్లీ మెట్లెక్కుతారో లేదో చూడాలి.