వరుస సమీక్షలు.. అధికారులకు పవన్ కీలక ఆదేశాలు
ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీల వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్.
డిప్యూటీ సీఎంగా, నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ వరుసగా రెండోరోజు కూడా సమీక్షలు చేపట్టారు. ఇకమీదట కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన రెండు వారాల్లో అవి పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు పవన్. ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీల వేతనాలు కూడా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేసే విషయాన్ని పరిశీలించాలని సూచించారు.
నిధుల మళ్లింపు..
తాజా సమీక్షలో కూడా గత ప్రభుత్వంపై విమర్శలు వినిపించాయి. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు దారిమళ్లిన విషయాన్ని.. అధికారులు గుర్తు చేసినట్టు తెలుస్తోంది. రూ. 5,500 కోట్లు దారి మళ్లినట్టు లెక్కలు తేల్చారు. అందులో పంచాయతీలకు సంబంధించినవే రూ.3,198 కోట్లు ఉన్నాయంటున్నారు. మిగతా రూ.2,302 కోట్లు జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు ఇచ్చిన నిధులని చెబుతున్నారు. ఆర్థిక సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించి మరీ విద్యుత్ ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు మళ్లించారని అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.
గతంలో టీడీపీ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. నిధులు దారిమళ్లుతున్నాయంటూ వైసీపీని టార్గెట్ చేసింది. కొంతమంది సర్పంచ్ లు పంచాయితీ నిధులపై తమకు పెత్తనం లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. నిధులు దారి మళ్లాయనడం సరికాదని, ఆ నిధులన్నీ తిరిగి పేదలకే అందాయనేది వైసీపీ వాదన. మరి కొత్త ప్రభుత్వం పంచాయతీ నిధులను ఎలా ఉపయోగిస్తుందో చూడాలి.