కలహాల సీమ - ప్రేమ సీమ.. పవన్ పంచ్ లు
జనసేనకు చిరంజీవి ఇచ్చిన విరాళానికి అనుకున్నంత ప్రచారం లేకపోవడంతో మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేశారు పవన్ కల్యాణ్.
చంద్రబాబుతో సావాస దోషం పవన్ కల్యాణ్ కి చాలా విషయాలు నేర్పించినట్టుంది. బురదజల్లడం, గుడ్డకాల్చి మీదవేయడాన్ని బాగా అలవాటు చేసుకున్నారు పవన్ కల్యాణ్. తాజాగా కోనసీమపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అందమైన కోనసీమను సీఎం జగన్ కలహాల సీమ చేయాలని చూశారట. దాన్ని కూటమి నేతలు ప్రేమ సీమగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారట. అంబాజీపేట ప్రజాగళం సభలో పవన్ వ్యాఖ్యలివి. కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో జరిగిన గొడవలు ప్రతిపక్షాలు సృష్టించినవే కదా..! మరి కలహాల సీమ చేయాలనుకున్నది కూడా టీడీపీ-జనసేన నేతలే కదా..! కానీ ఇప్పుడు పవన్ వైసీపీని టార్గెట్ చేయడం ఇక్కడ విశేషం.
ఎన్డీఏ కూటమిని త్రివేణి సంగమం అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు పవన్ కల్యాణ్. కోనసీమలోని కొబ్బరి, వరి రైతులకు కూటమి నేతలు అండగా ఉంటారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్ చేతుల్లోకి వెళ్లాయని, వాటిని రైతులకు మేలు చేసే విధంగా మారుస్తామని అన్నారు. కోనసీమకు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తామని ప్రకటించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు పవన్.
చిరంజీవి ప్రస్తావన..
జనసేనకు చిరంజీవి ఇచ్చిన విరాళానికి అనుకున్నంత ప్రచారం లేకపోవడంతో మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. తన అన్న చిరంజీవి, జనసేన కోసం 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారని అంబాజీపేట సభలో చెప్పారు పవన్. చిరంజీవి తనకు స్కిల్ డైవలప్మెంట్‌లో శిక్షణ ఇచ్చారని, అందుకే కోట్లాది ప్రజల ముందు నిలబడి మాట్లాడుతున్నానని చెప్పారు. చంద్రబాబు ఏపీకి పెద్దన్న లాగా వ్యవహరించి స్కిల్ డైవలప్మెంట్ లో యువతకు శిక్షణ ఇవ్వాలని కోరారు.