వారాహికంటే పెద్ద విజయం ఇదే.. జనసైనికుల సంతోషం
వన్ తో భేటీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఏపీ అభివృద్ధి గురించి తామిద్దరం చర్చించామన్నారు.
పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనతో జనసైనికులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మోదీతో కలసి మీటింగ్ లో పాల్గొనడంతోపాటు.. వరుసగా బీజేపీ పెద్దల్ని పవన్ కల్యాణ్ కలవడంతో రచ్చ రచ్చ చేస్తున్నారు అభిమానులు. పవన్ కి బీజేపీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చూడండి అంటూ పోస్టింగ్ లు పెడుతూ హల్ చల్ చేస్తున్నారు. పైగా పవన్ తో భేటీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఏపీ అభివృద్ధి గురించి తామిద్దరం చర్చించామన్నారు.
పవన్ కి ఏంటి లాభం..?
అసలు పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు..? ఎన్డీఏ పక్షాల మీటింగ్ కి అనేది బయటిమాట. టీడీపీ-బీజేపీని దగ్గర చేయడానికనేది వైరి వర్గాల ఆరోపణ. ఎవరి వ్యాఖ్యానాలు ఎలా ఉన్నా.. పవన్ కి హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దక్కడం విశేషం. ఆయనతో పవన్ ఏం చర్చించారు..? నిజంగానే జనసేనకు బీజేపీ అంత ప్రయారిటీ ఇస్తుందా అనే విషయం పక్కనపెడితే.. ఏపీలో బీజేపీకి నమ్మకమైన ఏకైక నేస్తం జనసేన. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక ప్యాకేజీని ని వెటకారం చేసినా.. మోదీ, అమిత్ షా నాయకత్వాన్ని పవన్ ఎప్పుడూ వేలెత్తి చూపలేదు. జనసేనతో వెళ్తే కాస్తో కూస్తో బీజేపీకే లాభం. ఇచ్చినన్ని సీట్లు చాలంటారు, ఉప ఎన్నికల్లో పోటీ పెట్టొద్దంటే సైలెంట్ అయిపోతారు. హైదరాబాద్ లో కూడా అడగకుండానే సపోర్ట్ చేస్తారు. అందుకే పవన్ కి అమిత్ షా అపాయింట్ మెంట్ అంత సులభంగా దొరికింది.
సాక్షి కథనాలు..
పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఫెయిల్ అంటూ సాక్షి కథనాలివ్వడం మాత్రం ఇక్కడ హైలెట్ గా మారింది. అసలు పవన్ కి ఉన్న ఓట్లెన్ని, సీట్లెన్ని..? అంటూ వెటకారం చేస్తూనే, పవన్ కి ఢిల్లీలో అపాయింట్ మెంట్లేవీ దొరకలేదని, రాయబారానికి వెళ్లిన ఆయన ఉత్త చేతులతో తిరిగొస్తున్నారని వైసీపీ అనుకూల మీడియా కథనాలిచ్చింది. ఈమధ్య చంద్రబాబుకంటే ఎక్కువగా పవన్ నే వైసీపీ టార్గెట్ చేసినట్టుంది.