సీబీఐని రంగంలోకి దింపండి.. జగన్ పై మోదీకి పవన్ ఫిర్యాదు

పేదలకు సొంతిళ్లు పేరుతో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులలో పెద్ద గోల్ మాల్ జరిగిందని అన్నారు పవన్. కేవలం భూసేకరణ పేరిట రూ.32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారన్నారు.

Advertisement
Update:2023-12-30 14:20 IST

నిన్న బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు సీఎం జగన్. ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గంటల వ్యవధిలోనే పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. అయితే జగన్ ని నేరుగా టార్గెట్ చేయలేదు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. ఐదు పేజీల ఆ లేఖలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు జనసేనాని.


ప్రధానికి పవన్ రాసిన లేఖ సారాంశాన్ని జనసేన సోషల్ మీడియా విభాగం బయటపెట్టింది. ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆ లేఖలో పవన్ పేర్కొన్నట్టు తెలిపింది. పేదలకు సొంతిళ్లు పేరుతో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులలో పెద్ద గోల్ మాల్ జరిగిందని అన్నారు పవన్. కేవలం భూసేకరణ పేరిట రూ.32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోందని, సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు బయటపడతాయని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారని, గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికే ఇచ్చారన్నారు పవన్.

కేంద్ర ప్రభుత్వం ఆల్రడీ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం వివిధ పథకాలను అమలు చేస్తోందని, ఆ పథకాల కింద విడుదలవుతున్న నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తన లేఖలో ఆరోపించారు పవన్ కల్యాణ్. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో వాటిని కలిపేసి వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందన్నారు. వేలకోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టిందన్నారు. వీటన్నిటికీ పరిష్కారం ఒకటేనని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆ లేఖలో పేర్కొన్నారు పవన్. దీనిపై వైసీపీ రియాక్ట్ కావాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News