బీజేపీతో కుదరదు.. పొత్తులపై పవన్ క్లారిటీ..!

కలసి కార్యక్రమాలు చేయడానికి వారు ముందుకు రాకపోతే నేనేం చేయను.. అంటూ ప్రశ్నించారు పవన్. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update:2023-03-15 05:40 IST

పవన్ కల్యాణ్

మచిలీపట్నంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పొత్తులపై తేల్చేస్తారని అనుకున్న జనసైనికులను, సేనాని కాస్త నిరాశ పరిచినా భవిష్యత్తులో తన ప్రయాణం ఎవరితో ఉంటుందో క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో కలసి వెళ్లే అవకాశం లేదని దాదాపుగా తేల్చేశారు.


బీజేపీతో పొత్తు పెట్టుకుని తాము అనుకున్న ప్లాన్‌ అమలుచేసి ఉంటే, టీడీపీ అవసరం లేకుండానే ఎదిగేవాళ్లం అని కానీ అది సాధ్యం కాలేదన్నారు పవన్ కల్యాణ్. అమరావతే ఏకైక రాజధాని అంటే ఢిల్లీ నేతలు ఒప్పుకున్నారని, స్థానిక నేతలు అలాంటిదేమీ లేదంటున్నారని చెప్పారు. కలసి కార్యక్రమాలు చేయడానికి వారు ముందుకు రాకపోతే నేనేం చేయను.. అంటూ ప్రశ్నించారు పవన్. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

టీడీపీతో ప్రయాణం..!

ఆవిర్భావ సభలో నేరుగా ప్రకటన చేయకపోయినా టీడీపీతో కలసి వెళ్తామనే సంకేతాలను పవన్ పంపించారు. అయితే సీట్ల విషయంలో ఎక్కడా తాను కాంప్రమైజ్ కాబోను అని మాత్రం తేల్చి చెప్పారు. పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులో తకరారు నడుస్తున్నందుకే ఆయన టీడీపీపై ఒత్తిడి పెంచేందుకు నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. టీడీపీపై తనకు ప్రత్యేకమైన ప్రేమ, చంద్రబాబుపై ఆరాధన లేవు అని, చంద్రబాబు సమర్థులన్న గౌరవం మాత్రం ఉందని చెప్పుకొచ్చారు.


Full View

175 సీట్లలో పోటీపై క్లారిటీ..

175 సీట్లలో పోటీ చేస్తావా అంటూ వైసీపీ వాళ్లు సవాల్ విసురుతున్నారని, ఏం జరిగితే బాగుంటుందే అదే చేస్తానని అన్నారు పవన్. వచ్చే ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని, తాను ప్రయోగాలు చేయబోనని అన్నారు. తనతో సహా పోటీ చేసిన అభ్యర్థులంతా గెలిచేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు పవన్. జనసేన కచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం కుదిరితే ఒంటరిగా పోటీ చేయడానికైనా సిద్ధమేనన్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యమో కూడా చూడాలన్నారు. టీడీపీతో పొత్తు కుదిరిపోయిందని, 20 సీట్లు జనసేనకు ఇచ్చారంటూ వస్తున్న వాట్సప్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారు పవన్.

పవన్ మనసులో ఏముంది..?

టీడీపీతో వెళ్లాలని పవన్ బలంగా కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే విషయంలో జనసైనికుల్ని ఆయన మానసికంగా సిద్ధం చేస్తున్నారు. వైసీపీ సవాళ్లకు రెచ్చిపోకూడదని నిర్ణయించుకున్నారు. సీట్ల విషయంలో కూడా వెనక్కి తగ్గేలా లేరు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, జనసేనకు ఇచ్చే సీట్ల వ్యవహారంలో టీడీపీ ఉదారంగా ఉంటే.. పొత్తుపై త్వరలోనే ఉమ్మడి ప్రకటన వచ్చే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News