సీఎం పదవిపై మరోసారి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

మంగళగిరి పార్టీ ఆఫీస్ లో క్రియాశీలక సభ్యులతో సమావేశం అయిన పవన్ తాజా రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. బీజేపీ పొత్తు గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించలేదు కానీ.. టీడీపీ-జనసేన కూటమి పోటీ చేస్తుందని మాత్రమే చెప్పారు.

Advertisement
Update:2023-10-20 18:12 IST

ఓసారి సీఎం పదవి తనకు వద్దంటారు, మరోసారి వస్తే కాదంటామా అంటారు, ఇంకోసారి మనకు ఆ పదవి రావాలి కదా అంటారు.. ఇలా ముఖ్యమంత్రి పదవిపై పదే పదే కన్ఫ్యూజింగ్ ప్రకటనలు చేయడం పవన్ కల్యాణ్ కి అలవాటే. తాజాగా ఆయన మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సీఎం పదవిపై తనకు సుముఖత ఉందన్నారు, కానీ ఆ పదవికంటే ప్రజల భవిష్యత్తే తనకు ముఖ్యమని తేల్చి చెప్పారు.


అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా..?

సీఎం పదవి కావాలంటే.. ముందుగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి. కానీ జనసేనకు అంత సీన్ లేదు, పోనీ మెజార్టీ సీట్లయినా టీడీపీ ఇస్తుందా అంటే అదీ లేదు. టీడీపీ ఇచ్చినన్ని సీట్లు పుచ్చుకోవాలి, మౌనంగా పోటీ చేయాలి. ప్రస్తుతం జనసేనకు వేరే దారి లేదు. ఉన్నా కూడా పవన్ కి ఆ దారి నచ్చదు. అందుకే రాజమండ్రి జైలుకి వెళ్లి మరీ చంద్రబాబుతో పొత్తు విషయం చర్చించారు, బయటకొచ్చి కీలక ప్రకటన చేశారు.

వైసీపీని ఓడించాల్సిందే..

తాను సీఎం అయినా కాకపోయినా పర్లేదని, తన పంతం మాత్రం వైసీపీని ఓడించడమేనని మరోసారి స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయేలా.. జనసేన, టీడీపీ ప్రభుత్వం వచ్చేలా ముందుకెళ్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారాయన. "సీఎం స్థానం పట్ల ఏరోజూ విముఖత చూపలేదు.. సుముఖతతోనే ఉన్నా.. కానీ, ఈరోజు మనకు సీఎం పదవికంటే ప్రజల భవిష్యత్తు ముఖ్యం. ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుంది. పార్టీ పరంగా ఏ నిర్ణయమైనా నేను ఒక్కడినే తీసుకునేది కాదు. ప్రజల్లో ఉన్న భావాన్ని పలు నివేదికల ద్వారా తెప్పించుకున్నాం." అని చెప్పారు పవన్ కల్యాణ్. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో క్రియాశీలక సభ్యులతో సమావేశం అయిన పవన్ తాజా రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. బీజేపీ పొత్తు గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించలేదు కానీ.. టీడీపీ-జనసేన కూటమి పోటీ చేస్తుందని మాత్రమే చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News