హమ్మయ్య.. పవన్ ఇగో శాటిస్ఫై అయింది
గతంలో 2014లో కూడా చంద్రబాబు రాజకీయ అవసరం కోసం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆయన పవన్ ఇంటికి వెళ్లి రాజకీయాలు మాట్లాడి వచ్చారు.
ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ చంద్రబాబు చుట్టూ తిరిగారు, కానీ ఇప్పుడు చంద్రబాబు స్వయంగా పవన్ కల్యాణ్ ఇంటికెళ్లారు. వారి ఇంటిలోనే రాజకీయాలు మాట్లాడారు. పవన్ దంపతులిద్దరూ బాబుకి స్వాగతం పలికారు. పొత్తులపై చర్చలు జరిగాయి, ఏపీలో భవిష్యత్ రాజకీయాల గురించి దాదాపు రెండున్నరగంటలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ చర్చలు, పొత్తులు ఎలా ఉన్నా.. పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లడాన్ని ఎల్లో మీడియా కూడా హైలైట్ చేస్తోంది. అలా పవన్ కల్యాణ్ కి ఇగోని తృప్తిపరిచింది.
గతంలో 2014లో కూడా చంద్రబాబు రాజకీయ అవసరం కోసం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆయన పవన్ ఇంటికి వెళ్లి రాజకీయాలు మాట్లాడి వచ్చారు. సహజంగా చంద్రబాబు పొలిటికల్ డీలింగ్స్ అన్నీ ఆయన ఇంట్లోనే జరుగుతాయి. లేదా ఏదైనా హోటల్ లో రాజకీయ సమావేశాలుంటాయి. రెండోసారి పొత్తు కుదిరాక పవన్ కల్యాణ్ కూడా తనకు తానే చంద్రబాబుని కలవడానికి చాలాసార్లు వెళ్లారు. కానీ ఇప్పుడు పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లడం విశేషం. ఏపీలో ఆయన అవసరం ఆ స్థాయిలో ఉంది కాబట్టే చంద్రబాబు ఓ మెట్టు కిందకు దిగారు.
ఇంటికొచ్చారు సరే, అడిగినన్ని సీట్లు ఇస్తారా..?
తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా ఉండి ఉంటే ఏపీలో బెట్టు చూపించే అవకాశం పవన్ కల్యాణ్ కి ఉండేది. కానీ తెలంగాణలో ఘోర పరాభవం తర్వాత ఆయన టీడీపీపై ఒత్తిడి పెంచే అవకాశాన్ని కోల్పోయారు. చంద్రబాబుకి కావాల్సింది కూడా ఇదే. అందుకే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీని వెనక్కు తప్పించి, జనసేన పోటీ చేసేలా రెచ్చగొట్టారు. ఇప్పుడు సీట్ల సర్దుబాటులో తనమాట నెగ్గేలా చేసుకున్నారు. కావాలంటే మేనిఫెస్టోలో పవన్ కల్యాణ్ మాట చెల్లుబాటు అవుతుందేమో కానీ, సీట్ల విషయంలో మాత్రం ఆయన టీడీపీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందే. అలా జరిగితేనే పవన్ పోటీ చేసే స్థానంలో టీడీపీ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తుంది. తన ఆర్థిక వనరులను కూడా ఉపయోగిస్తుంది. ఆ అవకాశం కోసమే పవన్ తన పార్టీ మొత్తాన్ని చంద్రబాబుకి చిత్తానికి వదిలేశారు.