జగ్గూ భాయ్.. పవన్ వెటకారం శృతి మించిందా..?
తన సభకు ఇంటెలిజెన్స్ వాళ్లు వచ్చి ఉంటారని, వారికి తాను చెప్పేది ఒక్కటేనని, నవరంధ్రాల్లో కెమెరాలు పెట్టడం మినహా ఇంకా మీ దగ్గర ఏమీ మిగల్లేదని అన్నారు పవన్ కల్యాణ్.
సీఎం జగన్ ని ఏకవచనంతో సంబోధిస్తానంటూ వారాహి సభల్లో చెప్పిన పవన్ కల్యాణ్.. ఈరోజు తాడేపల్లి గూడెం నియోజకవర్గ జనసేన నేతల మీటింగ్ లో జగ్గూభాయ్ అంటూ మరింత వెటకారంగా మాట్లాడారు. జగ్గూభాయ్ గ్యాంగ్ కి ఎవరో సలహా ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్ మనదే అనే భావన వారిలో ఉందని, త్వరలోనే ఆ భావన తీసేస్తామన్నారు. జగ్గూభాయ్ రాజకీయ నాయకుల్ని చూసి ఉంటారని, తనలాంటి విప్లవకారుడిని చూసి ఉండరని.. తనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. పవన్ అంటే ఒకరు కాదని, విప్లవకారుల సమూహం అని అన్నారు. "నన్ను కొడితే కొట్టుకో, నా భార్యను అంటే అనుకో, నా బిడ్డల్ని చంపేస్తావా.. చంపేసుకో జగ్గూభాయ్" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలా తెగించకపోతే క్రిమినల్స్ సామ్రాజ్యాన్ని కూలగొట్టలేమన్నారు.
తన సభకు ఇంటెలిజెన్స్ వాళ్లు వచ్చి ఉంటారని, వారికి తాను చెప్పేది ఒక్కటేనని, నవరంధ్రాల్లో కెమెరాలు పెట్టడం మినహా ఇంకా మీ దగ్గర ఏమీ మిగల్లేదని అన్నారు పవన్ కల్యాణ్. జనసేనను టీడీపీకి బీ టీమ్ అంటూ వైసీపీ వాళ్లు దాడి చేస్తున్నారని, దానికి ఎదురుదాడి చేయాల్సిందేనన్నారు పవన్. తాము ఎవరికీ బీటీమ్ కాదని, తనతో ఉన్నవాళ్లు ఆ విషయం నమ్మితే చాలన్నారు. మేము బి టీమ్ కాదు, వైసీపీ వాళ్లదే మర్డర్ టీమ్ అని జనసేన నేతలు రియాక్ట్ కావాలన్నారు.
షర్మిలపై పవన్ వ్యాఖ్యలు..
ఈసారెందుకో షర్మిలపై కూడా పవన్ కామెంట్లు విసిరారు. అర్జంట్ గా అధికారంలోకి రావాలనుకుంటే తాను కూడా గతంలో కాంగ్రెస్ లో చేరి ఉండేవాడినని, కానీ తనకు సిద్ధాంతాలు ముఖ్యమని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే మాటలు తన వరకూ వచ్చాయన్నారు. జగన్ జైలులో ఉంటే ఆయనకోసం కష్టపడి ఊరూరా తిరిగిన షర్మిలను ఇంట్లోనుంచి తరిమేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. షర్మిలపై సెటైర్లు వేస్తూనే, ఆమెకు మద్దతిచ్చినట్టు మాట్లాడారు పవన్.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇష్టానుసారంగా సంతకాలు పెట్టారని, ఆయన వల్ల కొంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారని గుర్తు చేశారు పవన్. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నాయకులను మహిళా పోలీస్ అధికారి చెంపపై కొట్టడం సరికాదన్నారు. ఆమె కొడుతున్నా ధైర్యంగా నిలబడటమే జనసేన నేతల గొప్పదనం అని చెప్పారు.