వారాహి మరింత లేట్.. సినిమాలపైనే పవన్ ఫోకస్
హరిహర వీరమల్లు విడుదలైతే ఆ తర్వాత ఉస్తాద్, ఓజీ, బ్రో సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ పూర్తి కావాలంటే కచ్చితంగా 8 నెలల పైమాటే.
అదిగో ఇదిగో వారాహి వస్తుంది, ఏపీ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తుంది అంటూ జనసైనికులు ఆమధ్య బాగా హడావిడి చేశారు. దానికి తగ్గట్టే వారాహికి రెండుచోట్ల పూజలు చేసి నేనొచ్చేస్తున్నానంటూ సిగ్నల్స్ పంపించారు పవన్. కానీ వారాహి ఇప్పుడల్లా రోడ్డెక్కేలా లేదు. లోకేష్ యువగళం కోసమే వారాహిని ఆలస్యం చేస్తున్నారంటూ ఓవైపు వైసీపీ కామెంట్లు చేస్తున్నా పవన్ మాత్రం నింపాదిగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలను ఒప్పుకుంటూ తన ప్రయారిటీ ఏంటో చెప్పకనే చెప్పేశారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, మల్టీస్టారర్ 'బ్రో' సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు పని దాదాపుగా పూర్తి కావాల్సి వచ్చినా, చివర్లో కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇప్పుడా సినిమాకి కూడా పవన్ కాల్షీట్లు ఫైనల్ చేశారు. జూన్ మొదటి వారంలో హైదరాబాద్ లోని స్టూడియోలో వేసిన భారీ సెట్లో ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు దర్శకుడు క్రిష్. 10రోజుల షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. హరిహరవీరమల్లు తర్వాత పవన్ మొదలు పెట్టిన భీమ్లా నాయక్ కూడా విడుదలైంది. కానీ ఆ సినిమా విషయంలోనే ఎందుకో ఆలస్యం జరుగుతోంది. ఈసారి కచ్చితంగా షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు క్రిష్.
ఉస్తాద్, ఓజీ, బ్రో..
హరిహర వీరమల్లు విడుదలైతే ఆ తర్వాత ఉస్తాద్, ఓజీ, బ్రో సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ పూర్తి కావాలంటే కచ్చితంగా 8 నెలల పైమాటే. అంటే ఏపీ ఎన్నికల నాటికి పవన్ సినిమాలు కూడా విడుదలకు రెడీగా ఉంటాయనమాట. 8 నెలలు షూటింగ్ కే సరిపోతే మిగిలిన 4నెలలు పవన్ రాజకీయాలకోసం కేటాయించాల్సి ఉంటుంది. అంత తక్కువ టైమ్ లో వారాహిని రోడ్డుపైకి తేవడం, రాష్ట్రమంతా పర్యటించడం అసాధ్యం. ఇదే ఇప్పుడు జనసైనికుల్లో ఆందోళన కలిగించే విషయం.
టీడీపీతో పొత్తు ఉంటుంది, 175 మొత్తం స్థానాల్లో మనం పోటీ చేయట్లేదనే విషయంపై జనసైనికులకు కూడా క్లారిటీ వచ్చేసింది. పోనీ టీడీపీ ఇచ్చిన కొన్ని స్థానాల్లో అయినా బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టి, ఇప్పటినుంచే ప్రచార జోరు పెంచితేనే ఫలితం ఉంటుంది. ఆ దిశగా అయినా పవన్ ఆలోచిస్తారేమోనని పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. పవన్ రాజకీయ క్షేత్రంలోకి దిగకుండా సినిమా షూటింగ్ లతోనే సరిపెడితే మాత్రం 2024 ఎన్నికలు కూడా జనసేనకు పెద్దగా ప్రయోజనకారి కావు అని చెప్పుకోవాలి.