పవన్ తో వర్మ భేటీ.. కాంప్రమైజ్ అయినట్టేనా..?

చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు, ఇక్కడ పవన్ కల్యాణ్ ఇంకేదో గట్టి హామీ ఇచ్చినట్టే ఉంది. అందుకే వర్మ కాంప్రమైజ్ అయ్యారు.

Advertisement
Update:2024-03-24 18:12 IST

సెటైరికల్ ట్వీట్స్ తో, సెటైరిక్ మూవీస్ తో ఆమధ్య పవన్ కల్యాణ్ ని తెగ ఇబ్బంది పెట్టారు రామ్ గోపాల్ వర్మ. ఇటీవల మరో వర్మతో పవన్ కి ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయనే ఎస్వీఎస్ఎన్ వర్మ. ఈయన పిఠాపురం కేంద్రంగా పవన్ కి చెమటలు పట్టిస్తున్నారు. టీడీపీకి చెందిన వర్మ పిఠాపురం టికెట్ తనకే కావాలని పట్టుబట్టారు, చివరకు చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీతో కాస్త మెత్తబడినా.. పవన్ కాకినాడ లోక్ సభకు వెళ్తే మాత్రం పిఠాపురంలో తానే అభ్యర్థిని అని మరోసారి బాంబు పేల్చారు. ఈ కన్ఫ్యూజన్ లో అసలు వర్మ కలిసొస్తారా లేదా అనే భయం పవన్ కల్యాణ్ కు పట్టుకుంది. అందుకే ఆయన్ను నేరుగా పార్టీ ఆఫీస్ కి పిలిపించి మాట్లాడారు. కాంప్రమైజ్ అయ్యారు.


చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు, మరిక్కడ పవన్ కల్యాణ్ ఇంకేదో గట్టి హామీ ఇచ్చినట్టే ఉంది. అందుకే వర్మ కాంప్రమైజ్ అయ్యారు. పవన్ ను భారీ ఆధిక్యంతో గెలిపించుకుంటామని చెప్పారు. మూడు పార్టీలు పిఠాపురంలో సమన్వయంతో కలసి పనిచేస్తాయని హామీ ఇచ్చారు. పవన్ కి పూలబొకే ఇచ్చి మరీ ఆల్ ది బెస్ట్ చెప్పారు వర్మ. ప్యాకేజీ స్టార్ అనే పేరున్న పవన్.. వర్మకు ఏం ప్యాకేజీ ఇచ్చారోననే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో పిఠాపురం రాజకీయం చాలా విచిత్రంగా మారింది. ఇక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించక ముందే వైసీపీ తమ అభ్యర్థిగా వంగా గీతను ఫిక్స్ చేసింది. పవన్ బరిలో దిగుతున్నానని చెప్పిన తర్వాత కూడా వారు అభ్యర్థిని మార్చాలనుకోలేదు. వంగా గీత అక్కడ పవన్ ని కచ్చితంగా ఓడిస్తారని ధీమాగా ఉన్నారు సీఎం జగన్. కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పవన్ కి టీడీపీ నుంచి వర్మతో ఇబ్బంది ఎదురైంది. సొంత పార్టీ కీలక నేతలు ఇటీవలే వైసీపీలో చేరారు. ఇక బీజేపీ అక్కడ ఉన్నా లేనట్టే. వైసీపీ అభ్యర్థి వంగా గీతకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మద్దతుగా ప్రచారం చేసే అవకాశాలున్నాయి. ఈ దశలో పవన్ పోరాటం కత్తిమీద సామేనని చెప్పాలి. ప్రత్యర్థుల బలాన్ని తగ్గించలేరు కానీ, కనీసం సొంత వర్గంలో ఉన్న అసంతృప్తిని కాస్తయినా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు పవన్. అందుకే వర్మతో భేటీ అయ్యారు, ఆయన్ను బుజ్జగించి పంపించారు. 

Tags:    
Advertisement

Similar News