కక్ష సాధింపుల సమయం కాదు -పవన్

జగన్‌తో తనకు వ్యక్తిగత కక్ష లేదని, కక్ష సాధింపు కోసం ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదన్నారు పవన్. ఆకాశమంత విజయాన్నిచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

Advertisement
Update:2024-06-04 20:50 IST

2019లో 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉన్నానని చెప్పారు జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్. తన జీవితమంతా ఎప్పుడూ దెబ్బలు తినడమేనన్నారు. తాను రాజకీయాల్లోకి డబ్బు, పేరు కోసం రాలేదని, సగటు మనిషి కష్టం చూసి వచ్చానన్నారు. గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటున్నానని, ప్రజలకోసం మరింత బాధ్యతగా పనిచేస్తానని చెప్పారు పవన్.


Full View

జనసేన గెలవడం 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని చెప్పారు పవన్. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన జనసేనాని, ఇది కక్ష సాధింపుల సమయం కాదని అన్నారు. ఏపీ అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయం ఇదని చెప్పారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం తాను కాదని, ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయన్నారు. పోటీ చేసి గెలిచింది 21 సీట్లలో అయినా, 175 సీట్లలో గెలిపిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యతగా పనిచేస్తాన్నారు పవన్ కల్యాణ్.

జగన్‌తో తనకు వ్యక్తిగత కక్ష లేదని, కక్ష సాధింపు కోసం ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదన్నారు పవన్. ఆకాశమంత విజయాన్నిచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. టీడీపీ నేత వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పారు. పిఠాపురం ప్రజలు కేవలం పవన్‌ను మాత్రమే గెలిపించలేదని, రాష్ట్రంలో ఐదు కోట్ల మందిని గెలిపించారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలెబెట్టుకుంటామన్నారు పవన్. 

Tags:    
Advertisement

Similar News