రచ్చకెక్కిన రాప్తాడు రాజకీయం.. పోటాపోటీ ధర్నాలు

వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత జగ్గు చేసిన కామెంట్లు మాత్రం పోలీసులకు అభ్యంతరకరంగా తోచాయి. దీంతో టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ కి తరలించారు.

Advertisement
Update:2022-11-27 13:56 IST

ఇటీవల కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పేరు ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమధ్య జాకీ కంపెనీని ఏపీ నుంచి తరిమేశారని, దానికి కారణం వైసీపీయేనంటూ వచ్చిన కథనాలతో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ తెరపైకి వచ్చారు. తన తప్పేమీ లేదని, చేసిందంతా టీడీపీ నాయకులేనని అన్నారాయన. అసలు జాకీ కంపెనీ పెద్ద ఫ్రాడ్ అని, దానివల్ల ఉపయోగం లేదన చెప్పుకొచ్చారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అక్కడ మొదలైన గొడవ తాజాగా దాడులకు దారితీసింది. రాప్తాడులో టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు పోలీస్ స్టేషన్ పంచాయితీ వరకు వెళ్లాయి.

రాప్తాడుని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలనుకుంటున్న పరిటాల కుటుంబం అక్కడ పార్టీ నాయకులకు, అనుచరులకు పూర్తి స్థాయిలో అండగా నిలబడుతోంది. ఈ క్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్, ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల చంద్రబాబు, లోకేష్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయంలో కాస్త శృతిమించారని అంటున్నారు. వైసీపీ నేతల కామెంట్లపై ఫిర్యాదులొచ్చినా పెద్దగా పట్టించుకోలేదు పోలీసులు. అయితే అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత జగ్గు చేసిన కామెంట్లు మాత్రం పోలీసులకు అభ్యంతరకరంగా తోచాయి. దీంతో టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ కి తరలించారు. వారిని పరామర్శించేందుకు టీడీపీ నేతలు రాగా వారిపై కూడా వైసీపీ వాళ్లు దాడి చేశారు. కార్ల అద్దాలు పగలగొట్టడంతోపాటు, తరిమి కొట్టారు.

దీంతో తాజాగా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, సత్యసాయి జిల్లా టీడీపీ అద్యక్షుడు పార్థసారథి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. టీడీపీ నేతలు బదులిస్తే మాత్రం వెంటనే కేసులు పెడుతున్నారని, తమపై వైసీపీ నేతలు భౌతిక దాడులకు దిగుతున్నా పోలీసులు చూసీ చూడనట్టు ఉంటున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టిన పరిటాల సునీత వైసీపీ నేతలకూ సవాల్ విసిరారు. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తారా? రండి తేల్చుకుందాం.. అంటూ సవాల్ విసిరారు.

Tags:    
Advertisement

Similar News