సై అంటున్న బాలినేని.. జగన్ ఫొటో లేకుండా ఫ్లెక్సీ
అధిష్టానం ఇంకా సైలెంట్ గానే ఉన్నా.. పార్టీ తరపున ఎవరో ఒకరు స్పందించక మానరు. బాలినేనిపై పరోక్ష వ్యాఖ్యలు బయటకొచ్చినా, ఆయన వర్గం ఘాటుగా బదులివ్వడానికి రెడీగా ఉంది.
ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇటీవల ప్రెస్ మీట్ లో దాదాపుగా అధిష్టానానికి అల్టిమేట్టం ఇచ్చినంత పని చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని అధిష్టానం కంట్రోల్ లో పెట్టాలన్నారు. రెండు రోజులవుతున్నా అధికారికంగా ఆయన వ్యవహారంపై పార్టీ స్పందించలేదు. అంటే ఆయన వ్యవహారాన్ని పక్కనపెట్టినట్టే లెక్క. మరోసారి తన బాధ చెప్పుకున్నా, ప్రెస్ మీట్ పెట్టుకున్నా.. బంతి బాలినేని కోర్టులోనే ఉంది. దాన్ని జగన్ కోర్టులోకి నెట్టాలనే ప్రయత్నం మాత్రం ఫలించడంలేదు. ఈలోగా ఒంగోలులో కనిపించిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. అందులో జగన్ ఫొటో లేదు, స్థానిక మంత్రి ఆదిమూలపు సురేష్ ఫొటో కూడా లేదు, అసలు వైసీపీ రంగులే లేవు.
వేసవి వడగాలుల ఉపశమన కేంద్రాలంటూ ఒంగోలు నగరపాలక సంస్థ పేరుతో కనిపిస్తున్న ఈ ఫ్లెక్సీలలో కేవలం బాలినేని ఫొటో మాత్రమే పెద్దగా ఉంది, స్థానిక నాయకులు కనిపిస్తున్నారు కానీ సీఎం జగన్ ఫొటో మిస్సైంది, జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ ఫొటోకి కూడా చోటు దక్కలేదు. ఈ వ్యవహారం బయటకొచ్చాక బాలినేని తనకు సంబంధం లేదని చెప్పొచ్చు కానీ, ఆయన అభిమానులు మాత్రం దాదాపుగా వైసీపీకి దూరం జరిగేందుకే ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఆమేరకు వారికి ఆదేశాలందాయనే చెప్పుకోవాలి.
ఇటీవల బాలినేని ఒంగోలు రైల్వే స్టేషన్ కి చేరిన సందర్భంలో కూడా ఆయన అభిమానులు బలప్రదర్శన చేపట్టారు. జై బాలినేని నినాదాలతో హోరెత్తించారు. ఎక్కడా జగన్ ప్రస్తావన లేదు, కనీసం పార్టీ కండువా కానీ, జెండా కానీ కనిపించలేదు. బాలినేని ప్రెస్ మీట్లో కూడా తనకు వైఎస్ఆర్ రాజకీయ భిక్ష పెట్టారంటూ పెద్దాయన పేరు గుర్తు చేశారు, ఆయన కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జగన్ హయాంలో మంత్రి పదవి పోయిన సందర్భాన్ని కూడా మరోసారి గుర్తు చేశారు. కార్యకర్తలకోసం ఏ త్యాగానికైనా సిద్ధం అని హింట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన అభిమానులు జగన్ ఫొటో లేకుండానే ఫ్లెక్సీలు వేశారు. దీంతో ఒంగోలులో రాజకీయ రచ్చ మొదలైంది.
అధిష్టానం ఇంకా సైలెంట్ గానే ఉన్నా.. పార్టీ తరపున ఎవరో ఒకరు స్పందించక మానరు. బాలినేనిపై పరోక్ష వ్యాఖ్యలు బయటకొచ్చినా, ఆయన వర్గం ఘాటుగా బదులివ్వడానికి రెడీగా ఉంది. అదే జరిగితే.. బాలినేని పార్టీ మార్పుకి రంగం సిద్ధమైనట్టే అనుకోవాలి.