రాయి వేసినవారి ఆచూకీ చెబితే రూ.2లక్షల బహుమతి
సీఎం జగన్ పై దాడి ఘటన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు జగన్ ని తాకింది రాయేనే, లేక ఇంకేదైనా పదునైన వస్తువా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.
సీఎం జగన్ పై రాళ్లదాడి వ్యవహారంలో పోలీసులు ఓవైపు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు నిందితుడి ఆచూకీ చెబితే రూ.2లక్షలు పారితోషికం ఇస్తామంటూ ప్రకటనలు విడుదల చేశారు. జగన్ పై దాడి గురించి ఏదైనా సమాచారం తెలిసి ఉంటే తమకు చేరవేయాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కోరారు. కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. నిందితుడిని కనిపెట్టే విధంగా వీడియో ఫుటేజ్ ఉన్నా, లేక ప్రత్యక్ష సాక్షి తమ ముందుకు వచ్చినా వారికి బహుమతి ఇస్తామన్నారు. తమ వద్దకు వచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.
పోలీసులు ఇచ్చిన ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్లు ఇవి..
9490619342, 9440627089
సీఎం జగన్ పై దాడి ఘటన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు జగన్ ని తాకింది రాయేనే, లేక ఇంకేదైనా పదునైన వస్తువా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. సంఘటనా స్థలాన్ని జల్లెడపట్టారు. స్థానికులందరి దగ్గర వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల వేళ, అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరగడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం వ్యవస్థలన్నీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి జవాబుదారీ కావడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాలతోనే వారు విచారణలో ముందడుగు వేస్తున్నారు.
ఈ దాడికి కారణం టీడీపీ, జనసేన అని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు ప్రేరేపిత కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అటు టీడీపీ కూడా వైసీపీ నేతలపైనే ఆరోపణలు చేస్తోంది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం వారే చేసుకుని ఉంటారని నిందలు వేస్తున్నారు. పోలీసు విచారణలోనే అసలు నిజాలు బయటపడాల్సి ఉంది.