సిట్టింగ్ ఎంపీలు ఎవరికీ నో సీట్.. జగన్ మాస్టర్ ప్లాన్!
ఎంపీల విషయానికి వస్తే సిట్టింగ్‌లు ఎవరికీ సీటు గ్యారంటీ అనే పరిస్థితి లేదు. కొత్తవారిని తీసుకొచ్చి నెగటివిటీ లేకుండా చూడాలని జగన్ భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు గెలుచుకుని విజయ ఢంకా మోగించిన వైసీపీ ఈసారి ప్రతి అడుగూ వ్యూహాత్మకంగా వేస్తోంది. ఇప్పటి వరకు 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను ప్రకటించిన వైసీపీ అందులో చాలాచోట్ల పాతవారికి చోటివ్వకుండా స్థానాలు మార్చింది. మరికొన్నిచోట్ల సిట్టింగ్‌లను పూర్తిగా పక్కనపెట్టేసింది. ఇక ఎంపీల విషయానికి వస్తే సిట్టింగ్‌లు ఎవరికీ సీటు గ్యారంటీ అనే పరిస్థితి లేదు. కొత్తవారిని తీసుకొచ్చి నెగటివిటీ లేకుండా చూడాలని జగన్ భావిస్తున్నారు.
22 మందిలో ఒక్కరికీ సిట్టింగ్ సీటుపై హామీ లేదా?
శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు మినహా 22 లోక్‌సభ స్థానాలను ఫ్యాన్ పార్టీ గెలుచుకుంది. అయితే ఈసారి విశాఖ స్థానంలో ఎంవీవీ సత్యనారాయణను అసెంబ్లీకి పంపి, ఆ స్థానంలో మంత్రి బొత్స భార్య, మాజీ ఎంపీ ఝాన్సీలక్ష్మిని వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించబోతోంది. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ సీటుకు పంపుతున్నారు. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం శాసనసభ స్థానానికి, రాజమండ్రి ఎంపీ భరత్‌ను రాజమండ్రి నగర ఎమ్మెల్మే బరిలోనూ నిలపాలని జగన్ నిర్ణయించారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, అనకాపల్లి ఎంపీ సత్యవతిలకు కూడా ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు.
సెంట్రల్ ఆంధ్రలోనూ అదే సీను
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అసమ్మతి నేతగా మారడంతో ఆయన సీటు ఎలాగూ గల్లంతయినట్లే. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పోటీకి విముఖత చూపడంతో మంత్రి కారుమూరి తనయుడు సునీల్ యాదవ్‌ను ఇక్కడ అభ్యర్థిగా నిర్ణయించారు. మచిలీపట్నం అభ్యర్థి బాలశౌరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తమ స్థానాలు మారతాయనే లెక్కలోనే పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఒంగోలు ఎంపీ మాగుంటకూ సీటు దక్కడం జరగని పని అని తేలిపోయింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విషయంలో ఇంకా స్పష్టత లేదు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించేశారు.
సీమలోనూ మార్పులే
కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌కూ సీటు లేదు. ఆయన స్థానంలో కర్నూలు మేయర్ బీవై రామయ్యను పోటీ చేయించాలని జగన్ ఆలోచన. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికీ స్థానచలనం తప్పదంటున్నారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను మార్చే అవకాశాలే ఎక్కువ. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు టికెట్ లేదని చెప్పేశారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి మాత్రమే టికెట్ లేదని నేరుగా చెప్పలేదు. అయితే ఆయన్నూ జమ్మలమడుగు అసెంబ్లీకి పంపే యోచన సీఎం జగన్‌కు ఉన్నట్లు వైసీపీ వర్గాల కథనం.