లోకేష్ పాదయాత్రలో అపశృతి, కానిస్టేబుల్ మృతి..
భోజన విరామ సమయంలో హెడ్ కానిస్టేబుల్ రమేష్ చనిపోవడంతో కలకలం రేగింది. విధి నిర్వహణలో ఉన్న రమేష్ భోజనం చేసి అక్కడికక్కడే కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు పోయాయి.
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. పాదయాత్ర బందోబస్తు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఎ.రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. గంగాధర నెల్లూరులో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆయన చనిపోయారు. భోజనం తీసుకుని కాసేపు రెస్ట్ తీసుకునే క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే రమేష్ ని పోలీసు వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రమేష్ ను పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
పాదయాత్రలో హడావిడి..
అంతకు ముందు పాదయాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం, సంసిరెడ్డిపల్లెలో లోకేష్ ప్రసంగాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై స్టూల్ వేసుకుని లోకేష్ ప్రసంగించే ప్రయత్నం చేయడంతో ఆయన వద్ద ఉన్న మైక్ ని పోలీసులు తీసుకున్నారు. స్టూల్ కూడా లాగేసే ప్రయత్నం చేశారు. రోడ్డుపై బహిరంగ సభలకు అనుమతి లేదంటూ పోలీసులు లోకేష్ కి చెప్పారు. దీంతో ఆయన పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు తీరుకు నిరసనగా రోడ్డుపై స్టూల్ వేసుకుని నిలబడి నిరసన తెలిపారు లోకేష్. పోలీసులతో టీడీపీ నేతలు కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది.
ఈ నేపథ్యంలో భోజన విరామ సమయంలో హెడ్ కానిస్టేబుల్ రమేష్ చనిపోవడంతో కలకలం రేగింది. విధి నిర్వహణలో ఉన్న రమేష్ భోజనం చేసి అక్కడికక్కడే కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు పోయాయి. పాదయాత్రలో ఎక్కువమంది నాయకులు పాల్గొన వద్దని పోలీసులు మొదటినుంచీ చెబుతున్నారు. జీవో నెంబర్-1 అమలులో ఉందని రోడ్లపై బహిరంగ సభలు వద్దని అంటున్నారు. అయితే లోకేష్ మాత్రం ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. అవకాశం వచ్చిన చోట అక్కడికక్కడే మిద్దెలపైకి ఎక్కి ప్రసంగిస్తున్నారు. పోలీసులు చుట్టుపక్కల ఇళ్లలోకి వెళ్లనివ్వకుండా చేసే సరికి ఈరోజు రోడ్డుపైనే స్టూల్ ఎక్కి ప్రసంగించే ప్రయత్నం చేశారు. లోకేష్ ప్రసంగాల విషయంలో గత మూడు రోజులుగా పాదయాత్రలో గందరగోళం నెలకొంటోంది.