పాద‌యాత్ర‌లో అసెంబ్లీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తున్న లోకేష్‌

ధ‌ర్మ‌వ‌రంలో నిర్వ‌హించిన బహిరంగ స‌భ‌లో టీడీపీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారో లోకేష్ చెప్ప‌క‌నే చెప్పేశారు. కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్న రాప్తాడు-ధ‌ర్మ‌వ‌రం నియోజకవర్గాల ప్రజలకు లోకేష్ ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు.

Advertisement
Update:2023-04-02 18:15 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పేరిట రెండు నెల‌లుగా పాద‌యాత్ర చేస్తున్నారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా పూర్త‌యి, అనంత‌పురం జిల్లాలోకి పాద‌యాత్ర ప్ర‌వేశించింది. పాద‌యాత్ర‌లో భాగంగా నియోజ‌క‌వ‌ర్గాల కేంద్రాల్లో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌భ‌లో నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థులు వీరే అనే అర్థం వ‌చ్చేలా లోకేష్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. అభ్య‌ర్థుల్ని మార్చే కొన్ని చోట్ల, పొత్తులో భాగంగా జ‌న‌సేనకు ఇచ్చే సీట్లు అని వార్త‌లు వ‌స్తున్న చోట్ల మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల స‌భ‌ల‌లోనూ అభ్య‌ర్థుల్ని లోకేష్ ప్ర‌క‌టిస్తున్నారు.

ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన బహిరంగ స‌భ‌లో టీడీపీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారో లోకేష్ చెప్ప‌క‌నే చెప్పేశారు. గత కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్న రాప్తాడు-ధ‌ర్మ‌వ‌రం నియోజకవర్గాల ప్రజలకు నారా లోకేష్ ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు. మొన్న రాప్తాడు సభలో వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబాన్ని ఆశీర్వదించండి పరిటాల సునీతని చూపిస్తూ ప్రజలను కోరిన నారా లోకేష్.. ధర్మవరం యువ‌గ‌ళం సభలో పరిటాల శ్రీరామ్ యువకుడు, ధైర్యవంతుడు, ఉత్సాహవంతుడు అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. పాదయాత్ర అయ్యాక పరిటాల శ్రీరామ్ మీ దగ్గరికి వస్తాడు.. శ్రీరామ్ ను ఆశీర్వదించండి అంటూ ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు నారా లోకేష్ పిలుపు ఇవ్వ‌డంతో ఆయ‌నే అభ్య‌ర్థి అని తేల్చేశాడు.

చిత్తూరు జిల్లాలోనూ చంద్ర‌గిరి పులివ‌ర్తి నాని, పీలేరు న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, ప‌ల‌మ‌నేరు అమ‌ర్ నాథ్ రెడ్డి, క‌దిరి వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ పేర్ల‌ను చెబుతూ వీరిని ఆశీర్వ‌దించండి అని నారా లోకేష్ ప్ర‌క‌టించ‌డంతో టీడీపీ అభ్య‌ర్థులు వారేన‌ని పార్టీ క్యాడ‌ర్‌కు, ప్ర‌జ‌ల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న స‌భ‌ల‌లో టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు వాడుకుంటున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

Tags:    
Advertisement

Similar News