భువనేశ్వరి బస్సు యాత్ర.. యువగళం ఇక లేనట్టే..!

యాత్ర చేసే ఉద్దేశం ఉంటే.. ఈపాటికే లోకేష్ తిరిగి రోడ్డుపైకి రావాలి. కానీ ఆయన విశ్రాంతికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ దశలో యువగళం తిరిగి ప్రారంభిస్తారనుకోలేం. అందుకే ఆ బాధ్యత మహిళా నేతలు తీసుకున్నారు.

Advertisement
Update:2023-10-05 07:51 IST

చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో టీడీపీ ప్రచార కార్యక్రమాలన్నీ మూలనపడ్డాయి, కేవలం నిరసనలతోనే నేతలు కాలం సరిపెడుతున్నారు. జనంలో సింపతీ రాకపోవడంతో ఆ కార్యక్రమాల వల్ల ఫలితం లేదని బాధపడుతున్నారు. ఈ దశలో నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. కుప్పం నుంచి బస్సుయాత్ర మొదలవుతుందని అంటున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ పై బుధవారం చర్చలు జరిగాయి.

కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి బస్సు యాత్ర ఎలా జరగాలి..? ఎక్కడెక్కడ ప్రసంగాలు ఉండాలి..? అనే విషయంపై స్థానిక నేతలు రూట్ మ్యాప్ తయారు చేసి రాష్ట్ర నాయకత్వానికి పంపించారు. తొలిసభ కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత యాత్ర ఇతర నియోజకవర్గాల్లో ప్రవేశిస్తుంది.

మరి యువగళం..

చంద్రబాబు జైలులో ఉన్నారు, లోకేష్ బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారిద్దరూ జైలు, బెయిలు అంటూ బాగా బిజీగా ఉన్నారు. ఈ దశలో చంద్రబాబు బయటకొచ్చినా మునుపటి ఉత్సాహంతో పర్యటనలు చేస్తారని అనుకోలేం. న్యాయ విచారణలతోనే ఆయనకు సమయం సరిపోతుంది. లోకేష్ కూడా యువగళం విషయంలో ఎందుకో వెనకడుగు వేశారు. కోర్టు కేసులున్నా, సీఐడీ విచారణ జరుగుతున్నా.. యాత్రకు ఒకటీ రెండు రోజులు విరామం ఇస్తే చాలు. కానీ లోకేష్ ఢిల్లీ పర్యటన పేరుతో యువగళం పక్కనపెట్టారు. యాత్ర చేసే ఉద్దేశం ఉంటే.. ఈపాటికే ఆయన తిరిగి రోడ్డుపైకి రావాలి. కానీ ఆయన విశ్రాంతికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ దశలో లోకేష్ తిరిగి యువగళం వినిపిస్తారనుకోలేం. అందుకే ఆ బాధ్యత మహిళా నేతలు తీసుకున్నారు.

బ్రాహ్మణి కూడా..?

భువనేశ్వరి బస్సుయాత్రతో పాటు, బ్రాహ్మణిని కూడా జనంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే బ్రాహ్మణి రాజమండ్రి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జనసేన నేతలు కూడా ఆమెను కలసి తమ మద్దతు తెలిపారు. ఇక యాత్రల విషయంలో ఆమె తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భువనేశ్వరి బస్సు యాత్ర మొదలైన తర్వాత వచ్చే స్పందన చూసి, బ్రాహ్మణి రంగంలోకి దిగాలా లేదా అనేది నిర్ణయిస్తారని తెలుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News