6నెలలే టైమ్.. ఏపీ అధికారులకు నాగబాబు వార్నింగ్
పవన్ కల్యాణ్ ధర్మో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తారని, ఏపీ సీఎం జగన్ ధనమో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు నాగబాబు.
"6 నెలలు టైమ్ ఇస్తున్నాం, మీ పద్ధతి మార్చుకోండి, సీఎం జగన్ చెప్పినట్టల్లా తప్పుడు పనులు చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త." అంటూ ఏపీలో అధికారుల్ని హెచ్చరించారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. తిరుపతిలో జరిగిన కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం మనందరి బాధ్యత అంటూ వారికి ఉపదేశమిచ్చారు. పదేళ్లు కష్టపడ్డాం, ఇంకొన్నిరోజులు కష్టపడండి చాలు.. అధికారం మనదేనని చెప్పారు. ఆరు నూరైనా ఈసారి టీడీపీ-జనసేన కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుందని అన్నారు నాగబాబు.
పొత్తులకు తూట్లు పొడవొద్దు..
టీడీపీతో కలసి పనిచేసే విషయంలో జనసేన నేతలకు హితబోధ చేశారు నాగబాబు. జనసైనికులు, వీరమహిళలు.. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి పనిచేయాలన్నారు. పొత్తులకు తూట్లుపొడిచే విధంగా ఎవరూ ప్రవర్తించొద్దని చెప్పారు. కష్టపడుతూ, నిస్వార్థంగా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు.
ధనమో రక్షతి రక్షితః
పవన్ కల్యాణ్ ధర్మో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తారని, ఏపీ సీఎం జగన్ ధనమో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు నాగబాబు. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రం అధోగతిపాలైందని, మరోసారి ఛాన్స్ ఇస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారని అన్నారు. సంక్షేమం ముసుగులో జగన్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను ఇష్టానుసారం తాకట్టు పెడుతోందన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ కలసి పనిచేస్తేనే వైసీపీ దౌర్జన్య పాలనకు అంతం అని చెప్పారు నాగబాబు.