కోపం వస్తే ఈవీఎం పగలగొట్టేస్తారా..?

కోపం వస్తే ఈవీఎం పగలగొట్టేస్తారా అని ప్రశ్నించారు నాగబాబు. నిజంగా అన్యాయం జరిగి ఉంటే, అక్కడ పోలీస్ సిబ్బంది, ఎన్నికల సిబ్బంది చూస్తూ ఊరుకోరు కదా అని అడిగారు.

Advertisement
Update:2024-07-04 18:40 IST

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టిన వీడియో బయటకు వచ్చినప్పటికంటే ఎక్కువగా, ఇప్పుడు ఆ ఘటనపై చర్చ జరుగుతోంది. పిన్నెల్లిని జైలులో పరామర్శించి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఆ ఘటన గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్లో ఎస్సీలను ఓటు వేయకుండా అడ్డుకుని, అన్యాయంగా ప్రవర్తిస్తున్న టైమ్ లో, పోలీసులు స్పందించని సందర్భంలో.. పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగిందని అన్నారు జగన్. అంటే ఆయన ఈవీఎం పగలగొట్టడాన్ని సమర్థిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. తాజాగా నాగబాబు కూడా ఇదే విషయంపై జగన్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ వేశారు. మరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా..? అని జగన్ ని ప్రశ్నించారు.


ఇప్పుడు పదకొండే.. ఈసారి సింగిల్ డిజిట్టే

కోపం వస్తే ఈవీఎం పగలగొట్టేస్తారా అని ప్రశ్నించారు నాగబాబు. నిజంగా అన్యాయం జరిగి ఉంటే, అక్కడ పోలీస్ సిబ్బంది, ఎన్నికల సిబ్బంది చూస్తూ ఊరుకోరు కదా అని అన్నారు. అవన్నీ ఆలోచించకుండా కోపమొచ్చి ఈవీఎంని పలగొడితే దాన్ని జగన్ ఎలా సమర్థిస్తారని అడిగారు. మిడి మిడి జ్ఞానంతో ఎచ్చులకు పోయినందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేశారని, ఇకనైనా పరిణితితో ఆలోచించకపోతే ఈసారి సింగిల్ డిజిట్ ఖాయమని విమర్శనాస్త్రాలు సంధించారు నాగబాబు.

జగన్ బెంగళూరు పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఏపీలో మళ్లీ పొలిటికల్ హీట్ పెరిగింది. నెల్లూరు పర్యటన తర్వాత ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతీకార దాడులను సహించేది లేదని, ఎల్లప్పుడూ అధికారం మీదికాదు జాగ్రత్త అంటూ సీఎం చంద్రబాబుని హెచ్చరించారు. జగన్ హెచ్చరికతో టీడీపీ, జనసేన నుంచి కౌంటర్లు పడుతున్నాయి. పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టిన ఘటనను జగన్ సమర్థిస్తున్నారా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు టీడీపీ, జనసేన నేతలు. ఒకవేళ సమర్థిస్తే వైసీపీ మరింత దిగజారినట్టేనని అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News