మోదీతో పవన్ మాట్లాడితే మంత్రులకు అంత భయమెందుకు..?

ఏపీలో జే గ్యాంగ్ చేసిన అవినీతిని తాము అధికారంలోకి వచ్చాక వెలికి తీస్తామని నాగబాబు హెచ్చరించారు. జగనన్న కాలనీల పేరుతో జే గ్యాంగ్‌ దోచుకున్నది మొత్తం రూ.15,191 కోట్లని అన్నారు.

Advertisement
Update:2022-11-15 08:32 IST

మోదీ-పవన్ భేటీపై వైసీపీ నుంచి వస్తున్న కౌంటర్లకు గట్టిగా రియాక్ట్ అయ్యారు మెగా బ్రదర్ నాగబాబు. అసలు మోదీ పవన్ మధ్య ఏం జరిగిందో మీకెందుకంటూ మండిపడ్డారు. వైసీపీ మంత్రులు ఎందుకు ఆవేదన చెందుతున్నారంటూ సెటైర్లు పేల్చారు. పవన్ ని చూస్తే వైసీపీ మంత్రులకు భయమా, అభద్రతాభావమా అని ప్రశ్నించారు.

పరిపాలన గాలికొదిలేశారా..?

వైసీపీ మంత్రులు పరిపాలనను గాలికొదిలేసి భేటీపై ఆరాలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు నాగబాబు. ఏపీ మంత్రులకు ఏ విషయంలోనూ పూర్తి పరిజ్ఞానం లేదని అలాంటి వారికి చదవడానికి స్క్రిప్ట్ కావాలని, అలా అందరికీ అందిస్తారనుకోవడం వారి భ్రమ అని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీలో ఎవరికి వారే సొంతంగా తమ అవగాహనతో మాట్లాడతారని చెప్పారు.


మేం అధికారంలోకి రాగానే..!!

ఏపీలో జే గ్యాంగ్ చేసిన అవినీతిని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వెలికి తీస్తామని నాగబాబు హెచ్చరించారు. జగనన్న కాలనీల పేరుతో జే గ్యాంగ్‌ దోచుకున్నది మొత్తం రూ.15,191 కోట్లని అన్నారు. ఇళ్ల స్థలాలకు గ్రావెల్‌ 5 కిలోమీటర్ల పరిధిలో నుంచి తరలించాలనే నిబంధనను సవరించి దోచుకున్నారని, జగనన్న కాలనీలకు ఇసుక ఉచితంగా ఇవ్వాల్సి ఉన్నా, దాన్ని కూడా దోపిడీగా మార్చేశారని, టన్నుకు రూ.675 పెట్టి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. భారతీ సిమెంట్స్ సంస్థకు లబ్ధి చేకూర్చడానికి మిగిలిన సిమెంట్‌ కంపెనీలతో కలిసి ధరలు పెంచేయడం వల్ల రూ.2,100 కోట్లు అదనపు భారం లబ్ధిదారులపై పడిందని నాగబాబు విమర్శించారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, కానీ ప్రభుత్వం 1.8 లక్షల రూపాయలు మాత్రమే మంజూరు చేస్తోందని, మిగతాదంతా లబ్ధిదారులపై భారంగా మిగులుతోందని చెప్పారు నాగబాబు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ లొసుగులన్నీ బయటకు తీస్తామని, గత ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News