వసంత పార్టీ మారుతున్నారా?
ఎందుకంటే కొడుకు వైసీపీలోనే ఉండేట్లయితే జగన్ అభిష్టానికి విరుద్ధంగా తండ్రి మాట్లాడే అవకాశమే లేదు. పైగా జగన్ మూడు రాజధానుల కాన్సెప్టును నాగేశ్వరరావు తప్పుపట్టడం మరింత ఆశ్చర్యంగా ఉంది.
అమరావతి రాజధాని విషయంలో తండ్రి మాటలు విన్నతర్వాత అందరు కొడుకును అనుమానిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రే మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు ఎంత పోరాటం చేస్తున్నారో అందరు చూస్తున్నదే. ఇదే సమయంలో వసంత నాగేశ్వరరావు మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలనే డిమాండును బలంగా వినిపిస్తున్నారు.
ఎమ్మెల్యేతో మాట్లాడనిదే తండ్రి అమరావతికి మద్దతుగా మాట్లాడే ఛాన్సేలేదనే వాదన పార్టీలో పెరిగిపోతోంది. పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్‌నే అమరావతికి మద్దతుగా నాగేశ్వరరావు వినిపిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ నిర్ణయం తీసేసుకున్నతర్వాత పార్టీలో నేతల వ్యక్తిగత ఇష్టాలతో సంబంధం ఉండదు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా జగన్ నిర్ణయాన్ని ఆమోదించాల్సిందే. అలాంటిది ఎమ్మెల్యే తండ్రి అమరావతికి మద్దతుగా మాట్లాడటాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అమరావతి నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారని, రాష్ట్రం మొత్తానికి విజయవాడ సెంటర్ పాయింటని, ప్రపంచంలో ఏ దేశంలోని రైతులు చేయనంత త్యాగాన్ని అమరావతి రైతులు చేశారని ఇలా చాలానే చెప్పారు. సరే నాగేశ్వరరావు చెప్పింది నిజమా కాదా అన్నది పక్కనపెట్టేస్తే అసలు అమరావతికి మద్దతుగా మాట్లాడనేకూడదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. సాంకేతికంగా ఏర్పాటు సాధ్యం కాకపోతే కనీసం తానైనా విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీసు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో నాగేశ్వరరావు అమరావతికి మద్దతుగా మాట్లాడటమే విచిత్రంగా ఉంది.
చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కృష్ణప్రసాద్ వైసీపీ తరపున పోటీచేసేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే కొడుకు వైసీపీలోనే ఉండేట్లయితే జగన్ అభిష్టానికి విరుద్ధంగా తండ్రి మాట్లాడే అవకాశమే లేదు. పైగా జగన్ మూడు రాజధానుల కాన్సెప్టును నాగేశ్వరరావు తప్పుపట్టడం మరింత ఆశ్చర్యంగా ఉంది. తండ్రి, కొడుకులు మాట్లాడుకున్న తర్వాతే అమరావతికి మద్దతుగా తండ్రి మాట్లాడుతున్నారనే అనుమానం పెరిగిపోతోంది. మరి తండ్రి వైఖరిపై కొడుకు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.