మా జాతి రిజర్వేషన్ జోకర్ కార్డులా మారింది -ముద్రగడ
తాను అలా చేసి ఉంటే కులంతో పాటు ఉద్యమం కూడా చులకనయ్యేదని చెప్పారు. ఉద్యమాల్లో, రాజకీయాల్లో డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎప్పడూ లేదన్నారు మద్రగడ.
కాపు జాతి రిజర్వేషన్ ఏపీ ఎన్నికల్లో జోకర్ కార్డ్ లా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. తన రాజకీయ నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. కిర్లంపూడిలో తన నివాసం నుంచి ఆయన ప్రజలకు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.
ప్రజలలలో మార్పు రావాల్సిన అవసరం చాలా ఉందన్నారు ముద్రగడ, మార్పు వస్తేనే రాజకీయాల్లో ఉన్నవారు తప్పకుండా మారతారని చెప్పారు. మాకు సారా, డబ్బు వద్దని రాజకీయ నాయకులకు ప్రజలు తెగేసి చెప్పే రోజు రావాలన్నారు. పేదవారి కోసం చేసే ఉద్యమాలు, వారి చిరునవ్వే తనకు ఆక్సిజన్, ఊపిరిలాంటివని చెప్పారు.
తుని ఘటన తర్వాత..
తుని బహిరంగ సభ తర్వాత రోజు తన నివాసాన్ని 6 వేల మంది పోలీసులు చుట్టుముట్టారని గుర్తు చేసుకున్నారు ముద్రగడ. తనను తీహార్ జైలుకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ రెడీగా పెట్టారని, బెయిల్ తెచ్చుకోండి, లేదా అండర్ గ్రౌండ్ కి వెళ్ళాలంటూ చాలామంది సలహాలిచ్చారని గుర్తు చేశారు. తాను అలా చేసి ఉంటే కులంతో పాటు ఉద్యమం కూడా చులకనయ్యేదని చెప్పారు. ఉద్యమాల్లో, రాజకీయాల్లో డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎప్పడూ లేదన్నారు మద్రగడ. ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు పాడుచేయాలని ఏనాడు ఎవరికీ సలహా ఇవ్వలేదన్నారు.
న్యాయస్థానానికి గౌరవం ఇవ్వడం కోసమే తాను ఇన్నాళ్లు వేచి చూశానని, చాలా బాధపడ్డానని అన్నారు ముద్రగడ. తుని ఘటనల విషయంలో తనకు జైలు శిక్ష వేసినా సంతోషంగా అనుభవించేవాడినని, కానీ తనతోపాటు ఉన్న అమాయకుల గురించే తాను ఆలోచించానని చెప్పారు. చివరకు సత్యం గెలిచిందని చెప్పారు. రైల్వే కోర్టు జడ్జి ఇచ్చే తీర్పు కోసం తన జాతి సోదరులతోపాటు, ఇతర వర్గాల వారు కూడా ఆసక్తిగా ఎదురూ చూడటం, తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు ముద్రగడ. తనపై ప్రేమ చూపించిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ లేఖ ముగించారు.