విజయసాయి రెడ్డికి రాజ్యసభలో ఆ హోదా పోవడం వెనుక ట్వీట్లే కారణమా?
బుధవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమవేశాలు ప్రారంభమయ్యాయి. కానీ, విజయసాయి రెడ్డి పేరు మాత్రం ప్యానెల్ సభ్యుల జాబితా నుంచి మిస్ అయ్యింది.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించే తీరు, పార్టీలోని చాలా మంది నాయకులకు కూడా నచ్చదు. చాలా నాసిరకంగా, ఎవరో గల్లీ కార్యకర్త పెట్టినట్లుగా ప్రత్యర్థి పార్టీ నాయకులను ట్విట్టర్ వేదికగా తిడుతుంటారు. అదే సమయంలో మిగిలిన విషయాలపై చాలా సందర్భోచితంగా, విలువైన సలహాలను ఇంగ్లీషులో ఇస్తుంటారు. ఆయన ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయ్యే వారికి తెలుగులో పెట్టే ట్వీట్లు సాయిరెడ్డే స్వయంగా చేస్తున్నారా? అకౌంట్ హ్యాక్ అయ్యిందా అనే సందేహాలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు ఇవే ట్వీట్లు ఆయన హోదా చేజారి పోవడానికి కారణమైందనే చర్చ జరుగుతోంది.
రెండు రోజులకు ముందు రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించినట్లు బులిటిన్‌లో ప్రకటించారు. సాయి రెడ్డి కూడా తనకు ఆ హోదాను కట్టబెట్టినందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సభ నిర్వహణలో తాను పూర్తి సహకారం అందిస్తానని కూడా చెప్పుకొచ్చారు. బుధవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమవేశాలు ప్రారంభమయ్యాయి. కానీ, విజయసాయి రెడ్డి పేరు మాత్రం ప్యానెల్ సభ్యుల జాబితా నుంచి మిస్ అయ్యింది.
గతంలో వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్‌గా ఉన్నప్పుడు వైస్ చైర్మన్ ప్యానల్ సభ్యుడిగా విజయసాయి రెడ్డి వ్యవహరించారు. అదే హోదాను తిరిగి ఆయనకు కొనసాగించినట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. కానీ, తాజాగా వెలువడించిన జాబితాలో నుంచి మాత్రం సాయిరెడ్డి పేరు తొలగించారు. ముందు విడుదలైన బులిటిన్‌లో భువనేశ్వర్ కలితా (బీజేపీ), ఎల్. హనుమంతయ్య (బీజేపీ), తిరుచి శివ (డీఎంకే), సుఖేందు శేఖర్ రాయ్ (తృణమూల్ కాంగ్రెస్), విజయసాయి రెడ్డి (వైసీపీ) పేర్లు ఉన్నాయి. కానీ, ఆ తర్వాత మార్పులు చేసి.. విజయసాయిరెడ్డి పేరు తొలగించి తాజా జాబితా విడుదల చేశారు. మిగిలిన పేర్లు ఉండి.. ఒక్క సాయిరెడ్డి పేరు మాత్రమే మిస్ కావడం వెనుక ట్వీట్ల ప్రభావం ఉందని తెలుస్తున్నది.
విజయసాయిరెడ్డి ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా.. ముఖ్యంగా ట్విట్టర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి వ్యక్తిని రాజ్యసభ కమిటీల నుంచి తప్పించాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్వయంగా రాజ్యసభ కొత్త చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ కలిసి ఈ ఫిర్యాదు అందించారు. ఆ ఫిర్యాదు ప్రభావంతోనే సాయిరెడ్డి పేరును పక్కన పెట్టినట్లు చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అటు రాజ్యసభ ప్రతినిధులు కానీ, ఇటు సాయిరెడ్డి కానీ ఇంత వరకు స్పందించలేదు.