అధికారులు ప్రభుత్వాలకు తొత్తులు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

కానిస్టేబుళ్లు నిజాయితీగా ఉన్నా, వారంతా ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించాలని, అదే సమయంలో ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వాలకు తొత్తులుగా ఉంటారని చెప్పారు మోహన్ బాబు.

Advertisement
Update:2022-12-20 08:34 IST

ప్రభుత్వాలకు అధికారులంతా తొత్తులుగా ఉంటారని ఆరోపించారు సినీ నటుడు మోహన్ బాబు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమా ప్రచారంలో భాగంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీసుల ఔన్నత్యాన్ని పొగుడుతూనే వారికి చురకలంటించారు. ప్రస్తుతం మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వాళ్లంతా తొత్తులే..

కానిస్టేబుళ్లు నిజాయితీగా ఉన్నా, వారంతా ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించాలని, అదే సమయంలో ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వాలకు తొత్తులుగా ఉంటారని, దీంతో కానిస్టేబుళ్లు నిజానిజాలు తెలిసినా సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి అని చెప్పారు మోహన్ బాబు. అయితే ఆయన ఎక్కడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తావన తేలేదు. ఐఏఎస్, ఐపీఎస్ లు ప్రభుత్వాలు చెప్పినట్టే వినాల్సిన పరిస్థితులున్నాయని మాత్రం అన్నారు మోహన్ బాబు.

రెండు ప్రభుత్వాల హయాంలోనూ..

2019 ఎన్నికల ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ డబ్బులు ఇవ్వడం లేదని మోహన్ బాబు రోడ్డెక్కారు. తమ విద్యాసంస్థలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు ఉన్న ప్రభుత్వం వాటిని విడుదల చేయడం లేదన్న ఆయన.. అప్పట్లో నిరసనకు దిగారు. ముందుగా నిరసనకు అనుమతిచ్చిన పోలీసులు, ఆ తర్వాత ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన పోలీసులపై ఫైరయ్యారు. ఆ తర్వాత జగన్ హయాంలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. మోహన్ బాబు నిరసన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఈ రెండు సంఘటనల వల్లే మోహన్ బాబు పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ప్రభుత్వానికి తొత్తులంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీస్ సంఘాల నుంచి ప్రతిస్పందన రాలేదు. గతంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పోలీస్ సంఘాల నేతలు, మోహన్ బాబు వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటారా, లేక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారా.. వేచి చూడాలి. మొత్తమ్మీద మోహన్ బాబు వ్యాఖ్యలు విశాల్ కొత్త సినిమాకు మాత్రం ప్రచారం తెచ్చిపెట్టాయి.

Tags:    
Advertisement

Similar News