విభజన కన్నా మోడీ చేసిన డ్యామేజీనే ఎక్కువ

మోడీ పాలనలో 2014-19 మధ్య ఏపీ అన్నీవిధాలుగా దెబ్బతినేసింది. విభజన జరిగిన తీరు ఒకటైతే మోడీ వైఖరి వల్ల జరిగిన నష్టం మరో ఎత్తు.

Advertisement
Update:2023-09-19 10:46 IST

రాష్ట్ర విభజనపై అసందర్భంగా నరేంద్ర మోడీ పార్లమెంట్‌ భవనంలో మొసలి కన్నీరు కార్చారు. కొత్త పార్లమెంటు భవనంలోకి మారేముందు చివరిసారిగా పాత భవనంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోడీ అనేక చారిత్రక ఘటనలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ విభజన సరిగా జరగలేదన్నారు. రాష్ట్ర విభజన ఏపీ - తెలంగాణలోని రెండు వర్గాలకు సంతృప్తి కలిగించలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో కష్టంతో జరిగిందని, ఎంతో రక్తం చిందించాల్సి వచ్చిందని బాధపడిపోయారు.

అయితే ఇక్కడ మోడీ మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే రాష్ట్ర విభజన జరిగిన తీరు వల్ల ఏపీకి బాగా నష్టం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల ఏపీకి ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. ఎలాగంటే విభజన హామీల్లో యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.

విభజన సరిగా జరగలేదని బాధపడుతున్న మోడీ మరి విభజన హామీలను ఎందుకని తుంగలో తొక్కేశారు? ప్రత్యేక హోదా అమలుచేయలేదు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వలేదు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని చంద్రబాబునాయుడు పట్టుబట్టగానే రాష్ట్రానికి ఇచ్చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఆపేశారు. మోడీ పాలనలో 2014-19 మధ్య ఏపీ అన్నీవిధాలుగా దెబ్బతినేసింది. విభజన జరిగిన తీరు ఒకటైతే మోడీ వైఖరి వల్ల జరిగిన నష్టం మరోఎత్తు.

దెబ్బతిన్న ఏపీని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆదుకుంటుందని నమ్మే జనాలు 2014లో బీజేపీకి ఓట్లేశారు. అలాంటిది జనాలను నమ్మించి మోసం చేయటం వల్లే కమలం పార్టీకి జనాలు కర్రకాల్చి 2019 ఎన్నికల్లో వాతపెట్టారు. ఇదే వాతను బహుశా వచ్చే ఎన్నికల్లో కూడా పెడతారేమో చూడాలి. ఏపీ అభివృద్ధిపై మోడీది మొసలి కన్నీరని అందరికీ అర్థ‌మైపోతోంది. తనది మొసలి కన్నీరన్న విషయం అందరికీ అర్థ‌మైందన్న విషయం ఇంకా మోడీకే అర్థంకాలేదేమో.


Tags:    
Advertisement

Similar News