చంద్రబాబు, పవన్ ని అరెస్ట్ చేయాలి.. మంత్రి రోజా డిమాండ్

సీఎం జగన్ పై దాడి జరిగిన ఏప్రిల్-13 ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని అన్నారు మంత్రి రోజా. ఎన్నికల కమిషన్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలన్నారు.

Advertisement
Update:2024-04-14 17:05 IST

జగన్ అనే నాయకుడు ఉన్నంతకాలం రాజకీయాల్లో తమకు భవిష్యత్ లేదనే విషయం చంద్రబాబు, పవన్ కి అర్థమైందని, అందుకే ఆయన్ని అంతమొందించాలనే ఉద్దేశంతోటే హత్యాయత్నం చేశారని మండిపడ్డారు మంత్రి రోజా. ఐదేళ్లుగా జగన్ కి ఇచ్చిన మాటకోసం అన్నీ సైలెంట్ గా భరిస్తూ వచ్చామని.. ఇక భరించే శక్తి తమకు లేదన్నారామె. జగన్ రక్తం వారు కళ్లజూశారని, ఎన్నికల్లో వారి రక్తం కళ్లజూసే విధంగా ప్రజలు తీర్పివ్వబోతున్నారని చెప్పారు. వెంటనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు రోజా.

సీఎం జగన్ పై దాడి జరిగిన ఏప్రిల్-13 ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని అన్నారు మంత్రి రోజా. ఎన్నికల కమిషన్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని, వారి వెనకున్న చంద్రబాబు, పవన్ ని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ మనసున్న నాయకుడని, గొప్ప నాయకుడని, ప్రజల కోసమే పుట్టిన నాయకుడని, దేవుడిలాంటి వాడని ఆమె కొనియాడారు. అలాంటి నాయకుడిని అంతమొందించాలనే కుటిల, నీఛమైన రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు.

సిద్ధం సభలు, బస్సు యాత్రకు వస్తున్న ఆదరణను చూసే సీఎం జగన్ ని అంతమొందించే ప్రయత్నం చేశారని అన్నారు మంత్రి రోజా. నిన్న జరిగింది కేవలం రాళ్లదాడి ఘటన కాదని, అది హత్యాయత్నం అన్నారు. వైసీపీ నాయకులతో కలసి ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సీఎం జగన్ లాంటి మంచి నాయకుడిపై దాడి చేసిన వారికి ఓటుతో కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు రోజా. 

Tags:    
Advertisement

Similar News