రామోజీ రాతలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయ్
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ని మీరు ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదమని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టంచేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రామోజీరావు అగ్రవర్ణాల అహంకారి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సీఎం జగన్‌కు అంబేడ్కర్ పేరు ఎత్తే అర్హత లేదని చెప్పడానికి రామోజీకి ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రామోజీ తన పత్రికలో రాసిన తప్పుడు రాతలపై మండిపడ్డారు. అసలు రామోజీరావుకు ఏం అర్హత ఉందని ముఖ్యమంత్రి జగన్, అంబేడ్కర్ గురించి కథనాలు రాశారని ఆయన ప్రశ్నించారు. రామోజీ రాతలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాను 2009లో అటవీ శాఖ మంత్రిగా పనిచేశానని, ఎర్ర చందనం అక్రమ తరలింపు కట్టడికి తానే మొదటగా చర్యలు తీసుకున్నానని ఆయన చెప్పారు. ఎవరి హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగిందో అందరికీ తెలుసని ఆయన తెలిపారు. చంద్రబాబు తన పక్కన తెచ్చిపెట్టుకున్న కిషోర్‌కుమార్ రెడ్డి ఎవరని ఈ సందర్భంగా మంత్రి ప్రశ్నించారు. 2009లో మహేశ్వర్ నాయుడు, రెడ్డి నారాయణలపై టాడా కేసులు పెట్టామని గుర్తుచేశారు. ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి వారి పేర్లతో రామోజీరావు వార్తలు రాస్తున్నాడని, ఎన్నికల కోసమే రామోజీ తాపత్రయమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ని మీరు ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదమని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టంచేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులున్నారా అనే విషయంలో సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తాము తీసేసినోళ్లను, పనికిరానోళ్లను చంద్రబాబు తన దగ్గర చేర్చుకుంటున్నాడని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ వద్ద క్వాలిటీ లీడర్‌షిప్ ఉందని, చంద్రబాబు ఏరకంగానూ తమకు దీటుగా లేడని మంత్రి తెలిపారు.