ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి కాకాణి స్పందన..
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని ఇన్ చార్జ్ గా ప్రకటించబోతున్నారనే వార్తలు కూడా అవాస్తవం అని చెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి. తానింకా శ్రీధర్ రెడ్డితో మాట్లాడలేదని, అసలు గిరిధర్ రెడ్డిని నాలుగు రోజులుగా తాను కలవలేదని వివరణ ఇచ్చారు.
ఏపీలో మూడు రోజులుగా రాజకీయ రచ్చగా మారిన ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎట్టకేలకు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి స్పందించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై కూడా ఆయన పెదవి విప్పారు. ఇప్పటి వరకూ మీడియాలో ప్రసారం అయిన కథనాలన్నీ కల్పితాలని తేల్చేశారాయన. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని, ఆయన పార్టీ మారడం, ఆయన స్థానంలో కొత్త ఇన్ చార్జిని పెట్టడం.. వంటివన్నీ కల్పిత కథనాలేనన్నారు కాకాణి.
భావోద్వేదగమే..!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, అందుకే తాను 12 సిమ్ కార్డులు వాడుతున్నానని, వాట్సప్ కాల్స్, టెలిగ్రామ్ కాల్స్ కూడా రికార్డ్ చేస్తున్నారని, అవసరమైతే తనపై నిఘా కోసం ఒక ఐపీఎస్ అధికారిని నియమించుకోవాలంటూ ఇటీవల కాస్త ఘాటుగానే మాట్లాడారు. ఆ తర్వాత అధిష్టానం ఆయనపై సీరియస్ అయిందని, ఆయన స్థానంలో పార్టీ కొత్తగా ఇన్ చార్జి ని నియమించబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో కోటంరెడ్డి కూడా సోమవారం సాయంత్రం తన అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీలో అవమానాలు జరుగుతున్నాయని, ఎక్కువకాలం వాటిని తట్టుకోవడం కుదరదని తేల్చేశారు. ఆయన పార్టీ మారడం ఖాయమని, ఆయన స్థానంలో ఇంకొకర్ని ఇన్ చార్జ్ గా నియమించడం కూడా ఖాయమనే వార్తల నేపథ్యంలో కాకాణి అదంతా కల్పితం అనడం విశేషం. ఎమ్మెల్యే కోటంరెడ్డి భావోద్వేగానికి గురై ఏదో మాట్లాడి ఉండొచ్చని, సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ లు వంటివి అస్సలు జరగవని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ గురించి వివరాలు తాను కనుక్కుంటానన్నారు కాకాణి. తాను కూడా పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు.
ఆ ప్రచారం కూడా వట్టిదే..
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని ఇన్ చార్జ్ గా ప్రకటించబోతున్నారనే వార్తలు కూడా అవాస్తవం అని చెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి. తానింకా శ్రీధర్ రెడ్డితో మాట్లాడలేదని, అసలు గిరిధర్ రెడ్డిని నాలుగు రోజులుగా తాను కలవలేదని వివరణ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ చార్జిని ప్రకటించే విషయంపై పార్టీలో కూడా చర్చ జరగలేదన్నారు కాకాణి. పార్టీలో కష్టపడి పనిచేసిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి అని కితాబిచ్చారు. ఆయన పార్టీ మారతాడనే వార్తలన్నీ మీడియా సృష్టేనన్నారు.