రెక్కీ, రాయి. రెండూ డ్రామాలే.. వైసీపీ కౌంటర్లు
పార్ట్-1 పవన్ డ్రామా ఎపిసోడ్, పార్ట్-2 చంద్రబాబు డ్రామా ఎపిసోడ్ అని, పార్ట్-3గా ఇప్పటం ఎపిసోడ్ ఉంటుందని మంత్రి జోగి రమేష్ సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడబలుక్కుని డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
ఓవైపు పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ, మరోవైపు చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లదాడి. ఈ రెండు అంశాలను ఆ రెండు పార్టీలు హైలెట్ చేస్తూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. అటు ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ లతో భయపెడుతూ, ఇటు ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు టీడీపీ, జనసేన నేతలు. వీటికి అదేస్థాయిలో వైసీపీ నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి. అసలు రెక్కీ, రాళ్లదాడి రెండూ డ్రామాలేనని, ఒకదాన్ని మించి ఇంకో దాన్ని రక్తి కట్టించడానికి చంద్రబాబు, పవన్ ఆపసోపాలు పడుతున్నారని అన్నారు మంత్రి జోగి రమేష్.
రెక్కీ ఐడియా బాబుదే..
హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ ఐడియా చంద్రబాబుదేనని, ఆయన చీప్ ట్రిక్స్ తోనే ఇలాంటి రాజకీయాలు చేస్తుంటారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అది రెక్కీ కాదని, ఆయన ఇంటి వద్ద తాగుబోతులు హడావిడి చేశారని తెలంగాణ పోలీసులు తేల్చేసినా ఇంకా రాద్ధాంతం ఎందుకన్నారు మంత్రి జోగి రమేష్. నిజంగానే రెక్కీ జరిగితే మాత్రం అది చంద్రబాబు డ్రామానే అని తేల్చేశారు.
పార్ట్-2 బాబు ఎపిసోడ్..
పార్ట్-1 పవన్ డ్రామా ఎపిసోడ్, పార్ట్-2 చంద్రబాబు డ్రామా ఎపిసోడ్ అని, పార్ట్-3గా ఇప్పటం ఎపిసోడ్ ఉంటుందని మంత్రి జోగి రమేష్ సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడబలుక్కుని డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి అనేది ఆయన విషపు రాజకీయ కుట్రలో ఒక కోణమని చెప్పారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనపై తానే రాయి విసిరించుకున్నాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడి లక్ష్యం 175కి 175 సీట్లు అని, ఈ లక్ష్యం దిశగా తాము పనిచేస్తున్నామని, అంతేకానీ దిక్కుమాలిన రాజకీయాలు చేసి చంద్రబాబుపై రాళ్లు వేయించాల్సిన పని తమకు లేదని అన్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు రాయి ఎవరితో వేయించుకున్నాడో తాము తేలుస్తామని, ఆయన బండారం బయటపెడతామని అన్నారు.