మహానాడు వేదికపైనే సమాధి చేసేవాడు

చెప్పులు వేసి, చిత్రవధ చేసి, చివరికి అదే వ్యక్తికి శతజయంతి ఉత్సవాలు చేయడం చంద్రబాబుకి మినహా ఇంకెవరికీ సాధ్యం కాదన్నారు జోగి రమేష్.

Advertisement
Update:2023-05-27 15:11 IST

ఏపీలో ప్రస్తుతం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలన్నీ టీడీపీ మహానాడు కేంద్రంగా సాగుతున్నాయి. మహానాడులో చంద్రబాబు, జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు అప్పుడే కౌంటర్లతో రెడీ అయిపోయారు. ముందుగా మంత్రి జోగి రమేష్, టీడీపీ నేతలకు ఫస్ట్ రౌండ్ ఇచ్చేశారు. మహానాడు వేదికపైనే చంద్రబాబుకి సమాధి కట్టేవారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నవ్విపోదురుగాక..

ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి, ఆయన అకాల మరణానికి కారణమైన చంద్రబాబు.. తిరిగి అదే ఎన్టీఆర్ కి శతజయంతి ఉత్సవాలు చేయడం హాస్యాస్పదం అన్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు లేకపోతే తాను నిండు నూరేళ్లు జీవించి ఉండేవాడినంటూ ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని చెప్పారు జోగి రమేష్. ఒక్క క్షణం ఎన్టీఆర్ కి మళ్లీ ప్రాణం వస్తే.. తనను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని మహానాడువేదికపైనే సమాధి చేసే అవకాశం కావాలని దేవుడిని కోరుకుంటారేమోనన్నారు. చెప్పులు వేసి, చిత్రవధ చేసి, చివరికి అదే వ్యక్తికి శతజయంతి ఉత్సవాలు చేయడం చంద్రబాబుకి మినహా ఇంకెవరికీ సాధ్యం కాదన్నారు జోగి రమేష్. బీసీలకు మేలు చేశానని బద్మాష్ బాబు చెబుతున్నారని, ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు.

అచ్చెన్నకు సెంటు భూమి సరిపోదు..

అచ్చెన్నాయుడి శరీరాకృతిపై కామెంట్ చేస్తూ.. ఆయన పడుకోడానికి సెంటుభూమి సరిపోదట అంటూ సెటైర్లు పేల్చారు మంత్రి జోగి రమేష్. అచ్చెన్న పనికిమాలినోడు అని, ఒళ్లు బలిసి మాట్లాడుతున్నాడని, ఆయన పడుకోడానికి ఓ ఊరు కూడా సరిపోదన్నారు. తన హయాంలో పేదలకు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేని చంద్రబాబు, ఇప్పుడు సెంటు భూమి అంటూ ఎగతాళి చేయడం సరికాదన్నారు. ముసలోడికి దసరా పండగ లాగా చంద్రబాబుకి మహానాడు దొరికిందన్నారు మంత్రి జోగి రమేష్. 

Tags:    
Advertisement

Similar News