రిటైర్మెంట్ ముందు అన్నకు ప్రమోషన్ గిఫ్ట్ గా ఇస్తున్న ఏపీ మంత్రి

ప్రమోషన్ల జాబితాకు వెంటనే ఆమోదముద్ర పడే అవకాశముంది. ఈలోగా ఈ విషయం బయటకు పొక్కింది.

Advertisement
Update:2024-08-29 08:06 IST

విశాఖ పట్నం స్పెషల్ బ్రాంచ్ లో డీఎస్పీగా పనిచేస్తున్న కింజరాపు ప్రభాకర్ నాయుడు ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. వాస్తవానికి ఆయన డీఎస్పీ హోదాలోనే రిటైర్ అవుతారు, కానీ హడావిడిగా ఆయనకు అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ ఇవ్వబోతున్నారు. ఏఎస్పీ హోదాలో ఆయన రిటైర్మెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు కావడంతో ప్రభాకర్ నాయుడు కోసం నిబంధనలు తుంగలో తొక్కారని, అడ్డదారిన ప్రమోషన్ కి ఏర్పాట్లు చేస్తున్నారని ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

ఏపీలో ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ పోస్టులకు 30 మంది డీఎస్పీలు అర్హులుగా ఉన్నారు. వారి పదోన్నతుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. పదోన్నతుల విధానం ఖరారైన తర్వాత ఈ జాబితాపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. దీనికి ఇంకా టైమ్ పడుతుంది. అయితే ఈనెల 31తో రిటైర్ అవుతున్న ప్రభాకర్ నాయుడు కోసం నిబంధనలు మార్చేస్తున్నారు. ఆర్థిక శాఖ అనుమతి లేదని చెబుతున్నా కూడా మంత్రి అచ్చెన్నాయుడు పట్టుబట్టారు. అందుకే ప్రభాకర్ నాయుడు ఏఎస్పీగా రిటైర్ కావడం ఖాయమైంది.

అవసరం లేకపోయినా ప్రమోషన్ ఇస్తే.. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర అలవెన్స్‌ల రూపంలో ప్రభుత్వంపై అనవసర భారం పడుతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. కానీ అచ్చెన్నాయుడు ససేమిరా అన్నారని, అందుకే ఆ ఫైల్ ఆఘమేఘాల మీద కదిలిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అటు పోలీసు శాఖ, ఇటు ఆర్థిక శాఖపై అచ్చెన్న తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారంటోంది. మంత్రి ఆదేశాలతో ప్రమోషన్ల ఫైలు మార్పులు చేర్పులతో సిద్ధమైంది. అడిషనల్ ఎస్పీల ప్రమోషన్ జాబితాను 22 మందికి పరిమితం చేశారు. ఈ జాబితాలో సరిగ్గా 22వపేరు ప్రభాకర్ నాయుడిది. అంటే ఎంత పగడ్బందీగా లిస్ట్ రెడీ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆయనకోసం మరో 21మందికి కూడా హడావిడిగా ప్రమోషన్లు ఇవ్వాల్సి వస్తోంది.

ప్రమోషన్ల జాబితాకు వెంటనే ఆమోదముద్ర పడే అవకాశముంది. ఈలోగా ఈ విషయం బయటకు పొక్కింది. అన్నయ్య ప్రమోషన్ కోసం అచ్చెన్న అక్రమాలు అంటూ ప్రతిపక్ష వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఈ ప్రమోషన్ ఫైలు కదులుతుందా..? విమర్శలకు భయపడి అయినా మంత్రి అచ్చెన్న వెనక్కు తగ్గుతారా..? వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News