అవన్నీ పుకార్లే.. మమ్మల్ని శంకించొద్దు
సీఎం జగన్ తో అత్యంత అనుబంధం కలిగిన కుటుంబం తమదని అన్నారు. తమతో జగన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని శంకించొద్దన్నారు దయాసాగర్.
ఎన్నికలకు ఏడాదికంటే ఎక్కువ టైమ్ ఉండగానే ఏపీలో అధికార పార్టీలో అలకలు మొదలయ్యాయి. మంత్రి పదవులు పోయినవారు, రానివారు, ఈసారి ఎమ్మెల్యే టికెట్ డౌట్ గా ఉన్నవారంతా ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నా భర్త ఎక్కడుంటే నేనూ అక్కడే.. ఇద్దరి మాటా ఒకటేనంటూ సుచరిత అనుచరులతో చెప్పిన మాటలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. సుచరిత దంపతులు త్వరలో టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దయాసాగర్ రాసిన లేఖ వార్తల్లోకెక్కింది.
ఏపీ సీఎం జగన్ కు మాజీ మంత్రి సుచరిత భర్త దయాసాగర్ బహిరంగ లేఖ రాశారు. అలాగే మీడియాకి కూడా ఆయన పలు విజ్ఞప్తులు చేశారు. దయాసాగర్ కేంద్ర సర్వీసులో ఉన్నతాధికారిగా పనిచేసి ఇటీవలే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఆయన రిటైర్ అయ్యారని, ఆయన టీడీపీ చేరతారని, ఆయన వెంట సుచరిత కూడా వైసీపీనుంచి టీడీపీలోకి వెళ్లిపోతారనే పుకార్లు ఎక్కువయ్యాయి. వీటిని దయాసాగర్ ఖండించారు. సీఎం జగన్ తో అత్యంత అనుబంధం కలిగిన కుటుంబం తమదని అన్నారు. తమతో జగన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని శంకించొద్దన్నారు.
దయాసాగర్ ఫలానా పార్టీ తరపున ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారాయన. తాను రాజకీయాల్లోకి వస్తే అందరికీ చెప్పే వస్తానన్నారు. తమ కుటుంబంలో ఎవరో ఒకరు పార్టీ మారతారు అనే ప్రశ్న ఉత్పన్నం అవడానికి ఆస్కారం లేదన్నారు. నిరాధారమైన ఊహాగానాలకు స్పందించాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదన్నారు. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు సుచరిత భర్త దయాసాగర్.