అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి, 18 మందికి గాయాలు
ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒకరు మృతిచెందగా, 18 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అనే ఫార్మా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి మృతిచెందగా, మరో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు.
ఈ ప్రమాదం మధ్యాహ్న భోజన సమయంలో జరగడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆరు అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా జరిగిన భారీ పేలుడుతో పెద్ద శబ్దం వచ్చిందని, దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. ప్రమాద స్థలిలో తక్షణ సహాయ చర్యలకు ఆదేశించారు. మరోపక్క వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.