మాండూస్ ఎఫెక్ట్: వణుకుతున్న తీరం, విద్యాసంస్థలకు సెలవు

Cyclone Mandous Effect in Andhra Pradesh :స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మధ్యాహ్నం నుంచి స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్టు ఆదేశాలిచ్చారు. తుపాను తీరం దాటిన తర్వాత రేపు ప్రభావం మరింత ఎక్కువగా ఉంటే మాత్రం సెలవలు కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటారు.

Advertisement
Update:2022-12-09 11:18 IST

మాండూస్ ఎఫెక్ట్: వణుకుతున్న తీరం, విద్యాసంస్థలకు సెలవు

మాండూస్ తుపాను ప్రభావంతో కోస్తా తీరం చిగురుటాకులా వణికిపోతోంది. గత తుపాన్ లకు భిన్నంగా ఈసారి వర్షాలు తక్కువ, ఈదురు గాలులు ఎక్కువ అన్నట్టుగా ఉంది పరిస్థితి. తుపాను ఈరోజు అర్థరాత్రికి తీరం దాటుతుందని అంచనా. అయితే కోస్తా జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నా భారీ వర్షాలు మాత్రం కురవడంలేదు. చిరుజల్లులు పడుతున్నాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈదురు గాలులకు చెట్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

అధికారులు అప్రమత్తం..

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారికి సెలవలు రద్దు చేశారు. కలెక్టరేట్లతోపాటు, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. అటు స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మధ్యాహ్నం నుంచి స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్టు ఆదేశాలిచ్చారు. తుపాను తీరం దాటిన తర్వాత రేపు ప్రభావం మరింత ఎక్కువగా ఉంటే మాత్రం సెలవలు కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటారు.


 



బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి శ్రీలంకలోని జాఫ్నా తీరానికి తూర్పు ఆగ్నేయ దిశలో 240కిలోమీటర్ల దూరంలో, కరైకాల్‌ కు 240 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 320 కిలోమీటర్ల దూరంలో మాండూస్ కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రోజు అర్ధరాత్రి నుండి రేపు తెల్లవారు ఝాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం దగ్గర్లో తుపాను తీరం దాటే అవకాశముంది.

తీరం దాటిన తర్వాత ప్రభావం..

తుపాను తీరం దాటిన తర్వాత దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంటున్నారు అధికారులు. అటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా తుపాను ప్రభావం కనిపిస్తుందని హెచ్చరిస్తున్నారు. తుపాను ప్రభావంపై నాలుగు రోజుల ముందుగానే అందర్నీ అప్రమత్తం చేశారు. ఈరోజు రాత్రి తీరం దాటే సమయంలో తుపాను విలయం సృష్టిస్తుందనే అంచనాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News