లోకేశ్ పాదయాత్ర ఎఫెక్ట్.. గడప గడప బాట పట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు

వైసీపీ ఎమ్మెల్యేలు కొంత మంది మరోసారి గడప గడపకు తిరిగి ప్రజలను కలవడానికి సిద్ధ పడుతున్నారు. గతంలో నిర్లక్ష్యం చేసిన వాళ్లే.. ఇప్పుడు ముందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Update:2023-01-29 08:51 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానసపుత్రిక 'గడప గడపకు మన ప్రభుత్వం'. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి ఇళ్ల వద్దకు వద్దకు ప్రభుత్వ ప్రతినిధులే వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రయోజనాల గురించి తెలుసు కోవడమే కాకుండా.. ఫిర్యాదులు, సలహాలు, సూచనలు కూడా స్వీకరించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సీఎం జగన్ పలు మార్లు ఈ కార్యక్రమంపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించి గడప గడపకు కార్యక్రమంలో మంత్రులతో సహా అందరూ పాల్గొనాల్సిందేనని ఆదేశించారు. ఈ కార్యక్రమం ఆధారంగానే టికెట్లు కేటాయిస్తానని కూడా స్పష్టం చేశారు.

సీఎం జగన్ పలు మార్లు హెచ్చరించినా చాలా మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంపై విముఖత చూపించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడమేంటనే వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యేలే ఇంటింటి బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ యువనేత నారా లోకేశ్ 'యువగళం' పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ప్రతిపక్ష టీడీపీ వెంట ప్రజలు ఉండరని, ఆ పాదయాత్ర విఫలం అవుతుందని మొదటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. కానీ మొదటి రోజే అనూహ్య స్పందన రావడం చూసి వైసీపీ ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. సీఎం జగన్ మొదటి నుంచి చెబుతున్నట్లు గడప గడపకు కార్యక్రమం తప్పకుండా ఓటర్లకు దగ్గర చేస్తుందని ఇప్పుడు నమ్ముతున్నారు.

ఇప్పటి వరకు జరిగిన గడప గడపకు కార్యక్రమంలో దాదాపు 26వేల ఫిర్యాదులు, అభ్యర్థనలు వచ్చాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తే తప్పకుండా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సీఎం చెప్పారు. ఇప్పటికే ఈ ఫిర్యాదులు, అభ్యర్థనలను ఆయా శాఖలకు బదిలీ చేశారు. గత ఏడాది మే 11న ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మొదట చాలా మంది ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. కొంత మంది అయిష్టంగానే కార్యక్రమాన్ని ముగించేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసినట్లు నివేదికలు స్పష్టం చేశాయి.

కానీ ఇప్పుడు వీళ్లంతా మళ్లీ ఇంటింటికీ తిరగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. నారా లోకేశ్ పాదయాత్ర వల్లే వీరిలో కదలిక వచ్చినట్లు చర్చ జరుగుతున్నది. ఈ కార్యక్రమం వల్ల తప్పకుండా అధికార పార్టీకి లబ్ది చేకూరుతుందని వైసీపీ రాజ్యసభ ఎంపీ, రీజినల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించే పనిలో అధికారులు ఉన్నారని.. ప్రభుత్వం 23,845 అభ్యర్థనల పరిష్కారానికి అనుమతులు ఇచ్చిందని ఆయన చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యేలు కొంత మంది మరోసారి గడప గడపకు తిరిగి ప్రజలను కలవడానికి సిద్ధ పడుతున్నారు. గతంలో నిర్లక్ష్యం చేసిన వాళ్లే.. ఇప్పుడు ముందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమం విలువ తెలియడంతోనే ఓటర్లను స్వయంగా కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి వైఎస్ జగన్ చెప్పినా కదలని ఎమ్మెల్యేలు లోకేశ్ పాదయాత్ర ఎఫెక్ట్‌తో ఇంటింటి బాట పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Tags:    
Advertisement

Similar News