రాజకీయాల్లోకి రా.. మనవడా..! ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతి పిలుపు..
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, ఆయన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారు.
జూనియర్ ఎన్టీఆర్ - అమిత్ షా భేటీ అనంతరం ఏపీ, తెలంగాణల్లో రాజకీయ వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ భేటీతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరికి మేలు జరిగింది అనే విషయం ఇంకా తేలలేదు. ఈలోగా అమిత్ షా వ్యూహాలను ఆకాశానికెత్తేసేవారు కొందరు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవితవ్యంపై మాట్లాడేవారు మరికొందరు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు లక్ష్మీపార్వతి. మనవడు జూనియర్ ఎన్టీఆర్‌ని ఆమె రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు.
తెలుగు అకాడమీ అధ్యక్షురాలుగా ఉన్న లక్ష్మీపార్వతి, తిరుపతిలో గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటున్న ఆమె, తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు జూనియర్ చేపట్టాలని కోరారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలని, అదే తన కోరిక అని అన్నారామె. చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారని ఆరోపించారు. ఆ పార్టీ జూనియర్ చేతుల్లోకి వెళ్తే పైనున్న ఆయన తాత ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని అన్నారు లక్ష్మీపార్వతి.
విద్యాశాఖను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే..
ఏపీలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబేనని అన్నారు లక్ష్మీపార్వతి. గత ప్రభుత్వ హయాంలో 30 వేల స్కూల్స్ మూతపడ్డాయని చెప్పారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. ఇంగ్లిష్ మీడియంపై విమర్శలు చేస్తున్నవారు... తమ పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్నామంటున్న వారు కూడా.. తమ సంతానం విషయంలో మాత్రం తెలుగు మీడియం ఎందుకు ఎంపిక చేసుకోవడంలేదని ప్రశ్నించారు. పేద పిల్లలకు కూడా ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్ కి మాత్రమే దక్కుతుందని చెప్పారు.