చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు.. మాడుపగిలే తీర్పు ఖాయం
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని, టీడీపీ నేతలు రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తున్నామని చెప్పారు కొడాలి నాని.
టీడీపీ వెనక ఉన్న కొంతమంది ఆ సామాజిక వర్గం నేతలు ధనబలం, కులపిచ్చితో విర్రవీగుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీని గెలిపించడానికి ఓటర్లకు డబ్బులు పడేయాలనుకుంటున్నారని, ప్రజాస్వామ్యంలో ఓటును కొని గెలవగలరా? అని ప్రశ్నించారు. పరాయిదేశంలో ఉంటూ హాయిగా డబ్బు సంపాదిస్తూ ఇక్కడున్న ఓటర్లను వెధవలంటూ కించపరుస్తున్నారని, ఓటర్లను దూషిస్తున్న అలాంటి వారే వెధవలు అని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, ఆయన మద్దతుదారులకు ఈ ఎన్నికల్లో కుక్కకాటుకి చెప్పుదెబ్బలాగా ఫలితం వస్తుందన్నారు నాని.
చంద్రబాబు చెప్పేవి ఏవీ చేయరని, బాబొస్తే జాబొస్తుందన్నారని, జాబులు ఎవరికిచ్చారని ప్రశ్నించారు కొడాలి నాని. నిరుద్యోగులకు భృతి అన్నారని, ఎవరికిచ్చారని నిలదీశారు. 2014లో మోసం చేశారని, మళ్లీ మోసం చేయడానికే కూటమిగా కట్టగట్టుకుని వస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు అల్జీమర్స్ ఉందని, ఆయన మర్చిపోయారు కాబట్టి.. ప్రజలు కూడా అన్నీ మర్చిపోయారనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలని, ఈ ఎన్నికల్లో ప్రజలు మాడుపగిలే తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు కొడాలి నాని.
ఎవరికి ఓటేయాలో ప్రజలకు తెలుసని, సంక్షేమం వైపే వారు నిలబడతారని చెప్పారు కొడాలి నాని. సీఎం జగన్ ఆధ్వర్యంలో తామంతా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీకి చెందిన కొంతమంది కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని, టీడీపీ నేతలు రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తున్నామని చెప్పారు కొడాలి నాని.