చంద్రబాబు-పవన్ కలవడం కాపులకు ఇష్టంలేదా..?

చంద్రబాబు వచ్చి పవన్ కు సంఘీభావం తెలిపి సమస్యలపై కలిసి పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు చేసిన ప్రకటనతో కాపులంతా సగం చచ్చిపోయారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Advertisement
Update:2022-11-10 12:11 IST

తాజాగా జరిగిన ఒక డెవలప్‌మెంట్‌ను చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. హైదరాబాద్ లోని నిజాంపేటలో కాపుల వనభోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు, బలిట, ఒంటరి సామాజికవర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో కొందరు సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. జీవీ. సుధాకర్ నాయుడు అనే న‌టుడు చాలా సినిమాల్లో ఒకప్పుడు విలన్‌గా న‌టించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతో పవన్ కలవటాన్ని తప్పుపట్టారు. దీనికి చాలామంది తర్వాత మద్దతిచ్చినట్లుగా మాట్లాడారు.

సుధాకర్ ఏమన్నారంటే.. విశాఖపట్నం ఎయిర్ పోర్టు ఘటన తర్వాత చంద్రబాబు వచ్చి పవన్ కు సంఘీభావం తెలిపి సమస్యలపై కలిసి పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు చేసిన ప్రకటనతో కాపులంతా సగం చచ్చిపోయారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యంపార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్, చింతకాయల విజయ్ నోటికొచ్చిన‌ట్టుగా తిట్ట‌డం పవన్ మరచిపోయుండచ్చు కానీ, కాపులెవరూ మరచిపోలేదన్నారు.

పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం గురించి, పెళ్ళిళ్ళ గురించి, సినిమా జీవితం గురించి టీడీపీ నేతలు ఎంత నీచంగా మాట్లాడారో మరచిపోయారా..? అంటూ పవన్‌ను నిలదీశారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడం మీ ఇష్టం అంటూనే తనచుట్టూ ఎవరెవరు ఉన్నారో ఒకసారి పవన్ చూసుకోవాలంటూ సూచించారు. కాపు రిజర్వేషన్ గురించి ఉద్యమాలు చేసిన ముద్రగడ పద్మనాభం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో పవన్ మరచిపోయినట్లున్నారంటూటు నిష్టూరంగా మాట్లాడారు. పొత్తులు పెట్టుకోవద్దని తాము చెప్పం కానీ, ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారో పవన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇచ్చారు.

పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని అందరు కోరుకుంటున్నారని చెబుతూనే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తామంతా ఎంతగా కష్టపడిందీ పవన్ ఒకసారి గుర్తుచేసుకోవాలన్నారు. ఒకసారి చంద్రబాబుకు చిరంజీవికి పడటం లేదని అర్థ‌మవ్వగానే కొన్ని ఛానళ్ళు చిరంజీవి గురించి ఎంత నెగిటివ్ గా ప్రచారం చేశాయో గుర్తులేదా అంటూ ప్రశ్నించారు. వనభోజనాల కార్యక్రమంలో సుధాకర్ మాటలకు అక్కడున్న వారంతా మద్దతు తెలిపారట. దీన్నిబట్టి చూస్తుంటే చంద్రబాబుతో పవన్ చేతులుకలపటం కాపుల్లోనే చాలామందికి ఏమాత్రం ఇష్టంలేదని అర్థ‌మైపోతోంది.

Tags:    
Advertisement

Similar News