బీజేపీకి కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా!
తనకు నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఇప్పటికీ వ్యతిరేకత లేదని, ఆయన పట్ల ఇప్పటికీ గౌరవం ఉందని, రాష్ట్ర నాయకత్వం అనుసరించిన పద్దతుల వల్లనే తాను పార్టీని వదులుతున్నానని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రవర్తన వల్లనే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు.
ఈ రోజు ఉదయం తన నివాసంలో ముఖ్య అనుచరులతో 'కన్నా' సమావేశమయ్యారు. ఆ సమావేశం అనంతరం కన్నా రాజీనామాపై నిర్ణయం ప్రకటించారు.
తనకు నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఇప్పటికీ వ్యతిరేకత లేదని, ఆయన పట్ల ఇప్పటికీ గౌరవం ఉందని, రాష్ట్ర నాయకత్వం అనుసరించిన పద్దతుల వల్లనే తాను పార్టీని వదులుతున్నానన్నారు. ఈ సందర్భంగా 'కన్నా' జీవీఎల్ నర్సింహ్మా రావు పైన కూడా విమర్శలు గుప్పించారు. ఆయన పార్టీతో సంబంధం లేకుండా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పుడు జీవీఎల్ కాపుల చుట్టూ తిరుగుతున్నాడని, అసలు ఆయన కాపుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు.
''నేను బీజేపీలో చేరినప్పటి నుంచి సైనికుడిలా పని చేశాను. నన్ను బీజెపి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత నన్ను చూసి ఇతరపార్టీల నుంచి అనేక మంది ముఖ్యనేతలు బీజేపీలోచేరారు. నన్ను తీసేసి సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించాక పార్టీ పని పద్దతులు దారుణంగా మారిపోయాయి. నేను పదవుల్లో నియమించిన వారినందరినీ వీర్రాజు తీసేశాడు. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. ఆయన వల్లనే నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను.'' అని కన్నా మీడియాతో చెప్పారు.
అయితే తాను ఏ పార్టీలో చేరతాననే విషయం ఇంకేమీ ఆలోచించలేదని, తన భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రకటిస్తానని కన్నా తెలిపారు.