నగరి కోర్టుకు హాజరైన జీవిత రాజశేఖర్..!
ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. అదే సమయంలో తమకు తాకట్టుపెట్టిన స్థలాన్ని రాజశేఖర్ దంపతులు అమ్మేశారని తెలుసుకున్న కోటేశ్వర రాజు నగరి కోర్టులోనూ, తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు కోర్టులోనూ రెండు కేసులు వేశారు.
సీనియర్ నటి జీవిత రాజశేఖర్ ఓ కేసు విషయమై తిరుపతి జిల్లా నగరి కోర్టుకు హాజరయ్యారు. ఈ కోర్టు నుంచి ఆమెకు గతంలో అరెస్టు వారెంటు జారీ కావడంతో ఆమె కోర్టుకు హాజరైనట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల కిందట రాజశేఖర్ హీరోగా గరుడవేగ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణం కోసం రాజశేఖర్ దంపతులు తమ వద్ద రెండు దఫాల్లో రూ.26 కోట్లు అప్పు తీసుకున్నారని నగరి నియోజకవర్గంలోని సాయి శక్తి ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకులైన కోటేశ్వర రాజు, ఆయన సతీమణి హేమా చెబుతున్నారు. ఈ మొత్తం పొందేందుకు రాజశేఖర్ దంపతులు తమకు చెందిన ఒక స్థలాన్ని తాకట్టుగా పెట్టినట్లు వాళ్ళు చెబుతున్నారు.
సినిమా విడుదలై విజయవంతమైన తర్వాత తాము ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలని కోటేశ్వరరావు ఒత్తిడి తీసుకురాగా.. ఆ మొత్తానికి గాను జీవిత రాజశేఖర్ దంపతులు చెక్కు రూపంలో అందజేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. అదే సమయంలో తమకు తాకట్టుపెట్టిన స్థలాన్ని రాజశేఖర్ దంపతులు అమ్మేశారని తెలుసుకున్న కోటేశ్వర రాజు నగరి కోర్టులోనూ, తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు కోర్టులోనూ రెండు కేసులు వేశారు.
ఈ కేసులకు సంబంధించి నగరి కోర్టు జీవిత రాజశేఖర్ కు వారెంట్లు జారీ చేసింది. ఈ కోర్టు నాలుగు సార్లు వారెంట్లు జారీ చేసినా ఆమె హాజరు కాలేదు. దీంతో కోర్టు ధిక్కార ఆరోపణలతో కోర్టు రెండు నెలల క్రితం ఆమె అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. ఈ కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించిన జీవిత ఆ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని నగరి కోర్టుకు హాజరయ్యారు. తనపై జారీ అయిన అరెస్టు వారెంట్ను కూడా రద్దు చేయించుకున్నారు. రాజశేఖర్ దంపతులు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడం, అలాగే తాకట్టు పెట్టిన స్థలాన్ని అమ్మడం పై కోటేశ్వర రాజు వేసిన కేసు మాత్రం ఇంకా విచారణలోనే ఉంది.