బీజేపీ మద్దతు, టీడీపీ మౌనం.. జనసేనకు జ్ఞానోదయం..?
పొత్తులో ఉన్నా లేనట్టే అనుకోవాల్సిన సందర్భంలో వ్యూహాత్మకంగా బీజేపీ, పవన్ కి మద్దతుగా నిలిచింది. తాజా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మాట్లాడారు.
పదే పదే చంద్రబాబుకి వంత పాడుతుంటారు పవన్ కల్యాణ్. బాబుపై పల్లెత్తు మాట పడినా ఆయన ఊరుకోరు. ఆమధ్య చంద్రబాబు అసెంబ్లీలో కన్నీరు పెట్టుకుంటే పవన్ చలించిపోయారు. మరి పవన్ కోసం చంద్రబాబు ఏం చేశారు..? ఏపీలో వాలంటీర్లు పవన్ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. ఫొటోలను చెప్పుతో కొడుతూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. వాలంటీర్ల చర్యలను టీడీపీ ఖండించాల్సిన పనిలేదు, పవన్ ని డైరెక్ట్ గా సపోర్ట్ చేయాల్సిన అవసరమూ లేదు. కనీసం వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల విషయంలో టీడీపీ స్టాండ్ ఏంటి అని కూడా చెప్పకపోవడమే ఇక్కడ చర్చనీయాంశం. పవన్ వర్సెస్ వాలంటీర్లు అనే వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ మౌనం దేనికి సంకేతం..? వాలంటీర్ల విషయంలో జనసేనకు డ్యామేజీ జరిగితే టీడీపీకి సంతోషమా..?
పొత్తులో ఉన్నా లేనట్టే అనుకోవాల్సిన సందర్భంలో వ్యూహాత్మకంగా బీజేపీ, పవన్ కి మద్దతుగా నిలిచింది. తాజా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. తాము గతంలో కూడా ఈ డిమాండ్ చేశామని, ఇప్పుడు మరోసారి చెబుతున్నామని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని, కేవలం వైసీపీ లబ్ధికోసమే దాన్ని ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు సోము వీర్రాజు.
వాలంటీర్ల విషయంలో పవన్ కల్యాణ్ ఇమేజి డ్యామేజీ అయిందనేమాట వాస్తవం. జనసేనపై కూడా వాలంటీర్లు ద్వేషం పెంచుకున్నారు. ఆధారాలు లేకుండా నిందలు వేయడం సరికాదంటున్నారు వాలంటీర్లు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో పవన్ వెనక్కు తగ్గకపోవడం విశేషం. క్షమాపణ కాదు కదా, రెట్టించి మరీ విమర్శలు చేస్తున్నారు. జనసైనికులతో సీఎం జగన్ దిష్టిబొమ్మలు తగలబెట్టిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ-జనసేన మధ్య ఈ వ్యవహారం డైరెక్ట్ ఫైట్ గా మారింది. చంద్రబాబు చేతులెత్తేశారు కాబట్టి పవన్ ఈ విషయంలో ఒంటరిగా పోరాడాల్సిందే. బీజేపీ మద్దతుతో ఆయనకు ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు. మరి ఈవివాదానికి పవన్ ఎలాంటి ముగింపు పలుకుతారో చూడాలి.