చదివింపులొద్దు.. జనసేనకు చందాలివ్వండి
జనసైనికుల ఇళ్లలో శుభకార్యాల సందర్భంగా చిత్రమైన ఇన్విటేషన్లు కనపడుతున్నాయి. తమ ఇంట్లో శుభకార్యాలకు వచ్చేవారు చదివింపులు తమకు ఇవ్వొద్దని, జనసేన పార్టీకి చందా రూపంలో చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇటీవల జనసేన పార్టీ 'నా సేనకోసం - నా వంతు' అనే కార్యక్రమం మొదలు పెట్టింది. పార్టీకోసం చందాలు సేకరిస్తోంది. ఆన్ లైన్ పేమెంట్ ద్వారా చందాలు స్వీకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. నాగబాబు పర్యవేక్షణలో ఈ టీమ్ పనిచేస్తోంది. అయితే ఇప్పుడీ పార్టీ చందాల కార్యక్రమం జనసైనికుల శుభ కార్యాల్లో కూడా హైలెట్ అవుతోంది.
'కట్నకానుకలు ఇవ్వదలచినవారు నా కుటుంబం కోసం కాకుండా మనందరి కుటుంబం అయిన జనసేన పార్టీకి తమ వంతు విరాళంగా ఇవ్వండి' అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం పెద గాడవిల్లి గ్రామంలో వెలసిన ఓ బ్యానర్ సారాంశం ఇది. ఈ గ్రామంలో ఓ కుటుంబం తమ ఇంటి ఆడబిడ్డ పుష్పవతి అయిన సందర్భంగా ఫంక్షన్ నిర్వహిస్తోంది. ఆ ఫంక్షన్ కి అందరికీ ఆహ్వానం పలుకుతూ ఇలా వెరైటీగా ఆహ్వాన పత్రిక రూపొందించింది. అదే ఆహ్వాన పత్రికను బ్యానర్లుగా కూడా ఊరిలో ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లో పవన్ కల్యాణ్ ఫొటో పెట్టారు. జనసేనపై తమకున్న అభిమానం చాటుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్..
ఈ ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు ఈ ఫొటోని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. పార్టీపై అభిమానం ఉన్నవారంతా ఇలాగే చేద్దామంటూ సందేశాలు ఉంచుతున్నారు. సదరు బ్యానర్ పెట్టిన కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ, పార్టీపై వారికున్న అభిమానానికి ధన్యవాదాలు చెబుతున్నారు. జనసైనికులు ఈ బ్యానర్ ని అభిమానంతో సర్క్యులేట్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం దీన్ని ట్రోల్ చేస్తున్నారు. శుభకార్యాలకు వచ్చే చదివింపుల్ని, చందాల రూపంలో ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద ఈ ఆహ్వాన పత్రిక మాత్రం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.