రోజు వ్యవధిలోనే మారిపోయిన పవన్ కళ్యాణ్ స్వరం.. అలా ఓట్లు పడితే మనమే సీఎం
మన బలం ఏంటో ముందు బేరీజు వేసుకోవాలి. అవసరమైతే తగ్గడమే కాదు.. బెబ్బులిలా తిరగబడాలి. హైదరాబాద్ నగరంలో ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జనసేనకి కనీసం ఆ సీట్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీ నేతలను ముఖ్యమంత్రిని చేసేందుకు జనసేన పార్టీ లేదని శుక్రవారం స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్.. 48 శాతం ఓట్లు ఇవ్వండి అప్పుడు మనమే సీఎం అని ఉత్సాహంగా మాట్లాడారు. మన బలం ఏంటో ముందు బేరీజు వేసుకోవాలి. అవసరమైతే తగ్గడమే కాదు.. బెబ్బులిలా తిరగబడాలి. హైదరాబాద్ నగరంలో ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జనసేనకి కనీసం ఆ సీట్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి తమిళనాడులో విజయ్ కాంత్‌లా కూడా మనల్ని గెలిపించలేదే అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.
గురువారం నాటి వ్యాఖ్యలకు భిన్నంగా ఈరోజు పవన్ కళ్యాణ్ పొత్తుపై మాట్లాడారు. మరో పార్టీ నాయకుడు.. ఇంకో పార్టీ నేతను సీఎం చేయాలని ఎందుకు అనుకుంటాడు? అని పవన్ ప్రశ్నించారు. కానీ 2009లో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన 18 అసెంబ్లీ స్థానాలు కూడా నాకు రాలేదు. కాబట్టి కండిషన్లు పెట్టి సీఎం పదవిని సాధించలేం అని తేల్చేశారు. కానీ.. నిన్న మాత్రం కనీసం 30 శాతం ఓట్లు వచ్చి ఉంటే ఇప్పుడు సీఎం రేసులో ఉండేవాడినని.. నన్ను సీఎం చేయమని బీజేపీని, టీడీపీని అడగనన్నారు. కాకపోతే ఈసారి పొత్తులతోనే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కానీ రోజు వ్యవధిలోనే సీఎం పదవిపై స్వరం మారిపోయినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు మోసం చేస్తే మేము ఏమైనా చిన్న పిల్లలమా? మాకేం గడ్డాలు లేవా? తెల్ల వెంట్రుకలు రాలేదా? ఏమి తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చామా? ఎలాంటి వ్యూహాలు లేనిదే పార్టీ పెట్టామా? అని పవన్ కళ్యాణ్ మండిపడ్దారు. జూన్ నెల నుంచే ప్రచారం మొదలు పెడతానన్న పవన్ కళ్యాణ్ రానున్న డిసెంబర్‌లోనే ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు.